Andhra Pradesh: సుమోటోగా ఓట్లను తొలగిస్తే చర్యలు తప్పవు: విజయవాడలో సీఈసీ సునీల్ అరోరా

  • ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని ఫిర్యాదులందాయి
  • ఏ స్థాయి అధికారులు తప్పు చేసినా చర్యలు తప్పవు 
  • బోగస్ ఓట్లపై 3 రోజుల్లో ఎంపిక చేసిన చోట తనిఖీలు 

ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ (సీఈసీ) సునీల్ అరోరా ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం ఏపీకి వచ్చారు. ఈ సందర్బంగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశాయన్నారు.

ఒక్కరికే రెండు, మూడు ఓట్లున్నాయని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓటర్ల నమోదు పాస్ వర్డ్ ఇస్తున్నారని, కొన్ని పార్టీలు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చేటప్పుడు ప్రమాణాలు చేయించుకుంటున్నారని, అలాగే పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వడంపై కొన్ని పార్టీలు ఫిర్యాదు చేశాయని ఆయన అన్నారు.

 ఈవీఎంలపై అందరూ సంతృప్తి వ్యక్తం చేశారని, ఎన్నికల విధుల్లో ఏ స్థాయి అధికారులు తప్పు చేసినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ చివరి రోజు వరకూ ఓటర్ల నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కచ్చితమైన దరఖాస్తు లేకుండా, సుమోటోగా ఓట్లను తొలగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెయిడ్ న్యూస్ పై దృష్టి సారించేందుకు కమిటీ పని చేస్తుందని, ఫిబ్రవరి 20లోగా బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ సీఎస్ ను ఆదేశించినట్టు పేర్కొన్నారు.

సి-విజిల్ యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, వంద నిమిషాల్లో ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని, ఈవీఎంలపై అనుమానాలు అక్కర్లేదని, ఎన్నికల కమిషన్ నిజాయతీగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత వచ్చి మమ్మల్ని కలిశారని, బదిలీలపై సీఎస్, డీజీపీలతో చర్చించామని, వాళ్లు వివరణ ఇచ్చాక దీనిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.

 పోస్ట్ డేటెడ్ చెక్కులపై ప్రభుత్వం నుంచి వివరణ కోరామని, ఈ ప్రక్రియ 2015 నుంచి అమలవుతోందని చెప్పారని, వాటిపై పూర్తి స్థాయిలో ఇంకా దృష్టి సారిస్తామని, రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వారిపై దృష్టి సారించామని, ఏం చర్యలు తీసుకుంటామన్నది త్వరలో చెబుతామని అన్నారు. బోగస్ ఓట్లపై మూడు రోజుల్లో ఎంపిక చేసిన చోట తనిఖీలు నిర్వహిస్తామని, రియల్ టైమ్ గవర్నెన్స్ సర్వేలపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై సీఈఓ విచారణ జరుపుతారని తెలిపారు.

  • Loading...

More Telugu News