Andhra Pradesh: ఏపీకి నిధులివ్వాలని నీతి ఆయోగ్ స్వయంగా చెప్పింది.. అయినా కేంద్రం ఇవ్వలేదు!: చంద్రబాబు ఆవేదన

  • రాఫెల్ లో ప్రధాని జోక్యంపై అభ్యంతరం
  • దళారి పనిని పీఎంవో చేసిందని వ్యాఖ్య
  • వెంకన్న సాక్షిగా హోదాపై మాటతప్పారని ఆగ్రహం

ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై  చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఒప్పంద ప్రక్రియలో ప్రధాని కార్యాలయం(పీఎంవో) జోక్యం చేసుకుందన్న వార్తల నేపథ్యంలో మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఓ దళారి చేయాల్సిన పనిని ప్రధాని కార్యాలయం చేయడం ఏంటని ప్రశ్నించారు.

‘ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో మాట్లాడి ఈ కాంట్రాక్టును రిలయన్స్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు? ఇందులో దురుద్దేశం లేదా?' అని నిలదీశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఈరోజు నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాఫెల్ ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.

ఈరోజు ఉదయం ధర్మపోరాట దీక్షకు వచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ముగింపు భేటీకి కూడా వచ్చారని చంద్రబాబు తెలిపారు. ఫరూక్ అబ్దుల్లా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తో కలిసి పనిచేశారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ తిరుమల వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే  సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర విచారణ సంస్థలతో వేధిస్తున్నారని మండిపడ్డారు.

ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు అంతా అబద్ధాలే చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. కేంద్రానికి అన్ని లెక్కలను, యూసీలను సమర్పించామని తెలిపారు. నీతి ఆయోగ్ ఏపీకి నిధులు ఇవ్వాలని సిఫార్సు చేసినప్పటికి కేంద్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసి ఉన్న ఇన్నాళ్లూ బాగానే ఉన్నప్పటికీ, విడిపోగానే వేధిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఏపీకి ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వలేదనీ, అన్ని రాష్ట్రాలతో పాటే ఏపీకి నిధులు కేటాయించారని స్పష్టం చేశారు.

More Telugu News