Indigo: ఎక్కడికక్కడ నిలిచిన ఇండిగో విమానాలు... ప్రయాణికుల గగ్గోలు!

  • 30 విమాన సర్వీసులు రద్దు 
  • వాతావరణం అనుకూలంగా లేదన్న సంస్థ 
  • సిబ్బంది కొరత అంటున్న మరో కథనం 

పైలట్ల లభ్యత లేదంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ నేడు 30 విమాన సర్వీసులను రద్దు చేసింది. దేశీయ విమానయాన రంగంలో తక్కువ టికెట్ ధరతో సర్వీసులు నడుపుతున్న సంస్థ, హైదరాబాద్, చెన్నై, జైపూర్ తదితర విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన విమానాలను రద్దు చేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కదలాల్సిన ఆరు సర్వీసులు ఆగిపోగా, చెన్నైలో 8, జైపూర్ లో 3 సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేశారు. సిబ్బంది కొరత కారణంగానే ఇలా చేయాల్సి వచ్చిందని సమాచారం.

వాస్తవానికి పైలట్లు ఏడాదికి వెయ్యి గంటలు మాత్రమే విమానాలను నడపాల్సివుంటుంది. ఇండిగో పైలట్లంతా దాన్ని అధిగమించారని తెలుస్తోంది. కాగా, పలు నగరాల్లో మంచు దట్టంగా కురుస్తూ ఉండటం, వాతావరణం అనుకూలించని కారణంగా 30 సర్వీసులు నిలిపివేశామని సంస్థ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. మరో 11 విమానాల దారి మళ్లించామని తెలిపింది. విమాన సర్వీసుల రద్దుతో గమ్యస్థానాలకు చేరే మార్గం లేక వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు ఇండిగో వెల్లడించింది.

More Telugu News