Andhra Pradesh: ఏపీని ‘సన్ రైజ్’ రాష్ట్రంగా చేస్తానన్న చంద్రబాబు.. ఇప్పుడు 'సన్' లోకేశ్ ను రైజ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు!: మోదీ సెటైర్

  • మహాకూటమి అనేది మహా కల్తీ కూటమి
  • చంద్రబాబు నన్ను తిట్టే పోటీలో దిగిపోయారు
  • గుంటూరు ప్రజా చైతన్య సభలో మోదీ ఆగ్రహం

దేశంలోని ఆడ బిడ్డలను ఇన్నాళ్లూ పొగలో మగ్గేలా చేసిన రాజకీయ నేతలు ఇప్పుడు మహాకూటమి పేరుతో అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు ఈ కూటమితో కలిసి తనను తిట్టిపోసే పోటీలో దిగిపోయారని వ్యాఖ్యానించారు. విపక్షాలది మహాకూటమి కాదనీ, మహా కల్తీ కూటమి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ విజన్ ను చంద్రబాబు గాలికి వదిలేశారని మోదీ స్పష్టం చేశారు. ఏపీలో మౌలికవసతుల రంగంలో టర్న్ అరౌండ్(గొప్ప మార్పు) తీసుకొస్తానని తనను కలిసిన ప్రతీసారి చెప్పిన చంద్రబాబు.. చివరికి యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి నవనిర్మాణ హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కుప్పకూలిపోయిన టీడీపీని పునర్ నిర్మించుకునే పనిలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

ఏపీని సన్ రైజ్ రాష్ట్రంగా చేస్తానన్న చంద్రబాబు.. ఇప్పుడు కుమారుడు (సన్) లోకేశ్ ను రైజ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారని సెటైర్ వేశారు. కేంద్ర పథకాలకు తన స్టిక్కర్లు వేసి ఏపీ సీఎం చంద్రబాబు కలరింగ్ ఇస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం విషయంలో మాటమారిస్తే ఈ కాపలాదారు ఊరుకోడని స్పష్టం చేశారు.

More Telugu News