Andhra Pradesh: గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లకు దీటుగా నిర్మించాం: సీఎం చంద్రబాబు

  • ఏపీ వ్యాప్తంగా నాలుగు లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు
  • జీ+3 విధానంలో ఇళ్లు నిర్మిస్తున్నాం
  • అవసరమైతే అపార్టు మెంట్లలో లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తాం 

ఏపీలో ప్రభుత్వం నిర్మించిన నాలుగు లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు ఈరోజు జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొని ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 17,117 ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం, ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లకు దీటుగా వీటిని నిర్మించామని, ఆధునిక పరిజ్ఞానంతో జీ ప్లస్ 3 విధానంలో ఇళ్లు నిర్మిస్తున్నామని, అవసరమైతే అపార్టు మెంట్లలో లిఫ్ట్ లు ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. కమర్షియల్ ప్రదేశం, పాఠశాల, పార్కులు, అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గతంతో పోలిస్తే ఇళ్ల నిర్మాణానికి ఏడు రెట్లు ఎక్కువ నిధులు ఇస్తున్నామని, డబ్బులున్న తెలంగాణ రాష్ట్రం, పక్కనే ఉన్న కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఇన్ని ఇళ్లు కట్టలేదని గుర్తుచేశారు.
 
పేదవాడి ముఖంలో ఆనందం చూసేందుకే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు. చరిత్రలో ఎప్పుడూ జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఏపీలో తీసుకువచ్చామని, వచ్చే ఐదేళ్లలో ప్రతి ఇంటికీ రూ.25 వేల కనీస ఆదాయం వచ్చేలా కృషి చేస్తానని చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు. పేదరికం లేని సమాజం నిర్మించడమే తన లక్ష్యమని, చిన్న ఉద్యోగులకు కూడా జీతాలు బాగా పెంచామని, పోలీసు శాఖలో 3,500 మందికి పదోన్నతులు కల్పించామని, రూ. 200 ఉన్న పింఛన్ ని రెండు వేల రూపాయల చేశామంటే అది ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. 

More Telugu News