Guntur District: గుంటూరులోని ఏటుకూరు బైపాస్‌ వద్ద రేపు బీజేపీ 'సత్యమేవ జయతే' సభ.. హాజరుకానున్న ప్రధాని మోదీ

  • చురుకుగా ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు
  • ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర అధ్యక్షుడు కన్నా
  • మూడు హెలిఫ్యాడ్‌లు సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు నగర శివారులోని ఏటుకూరు బైపాస్‌ వద్ద ఆదివారం 'సత్యమేవ జయతే' పేరుతో బీజేపీ నిర్వహించనున్న ప్రజా చైతన్య సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. సభా ప్రాంగణానికి వాజపేయి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

రాష్ట్రంలోని గుంటూరు, విశాఖపట్నంలో ప్రధాని సభలు జరగనున్నాయని గతంలోనే బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విశాఖ సభ ఈ నెలాఖరుకు వాయిదా పడింది. గుంటూరు సభ మాత్రం ఆదివారం జరుగుతుంది. మోదీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఘనంగా స్వాగతం పలుకుతామని ఈ రోజు ఏర్పాట్లు పరిశీలించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. మోదీ రాకపై టీడీపీ గుర్రుగా ఉండడం, ప్రజా సంఘా ఆందోళనల వార్తల నేపథ్యంలో సభ వద్ద పటిష్ట బందోబస్తు చేస్తున్నారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ డీజీ రవి శంకర్ అయ్యన్నార్ పర్యవేక్షణలో 1,700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మోదీ ఉదయం 11.10 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఎప్పీజీ అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ట్రయిల్‌ రన్‌ కూడా పూర్తి చేశారు. సభా ప్రాంగణం ఆవరణలో మూడు హెలిఫ్యాడ్‌లు సిద్ధం చేశారు.

ఈ పర్యటనలో విశాఖలో రూ.1,178.35 కోట్లతో ఏర్పాటు చేసిన 1.33 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన చమురు నిల్వ కేంద్రాన్ని, ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో రూ.5, 300 కోట్ల అంచనా వ్యయంతో కేజీ బేసిన్‌లో ఏర్పాటు చేసిన గ్యాస్ ఫీల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుని గుంటూరు సభ వేదిక నుంచే ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే కృష్ణపట్నంలో 100 ఎకరాలలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్న చమురు సమీకరణ, నిల్వ పంపిణీ టెర్మినల్‌కు ఇదే వేదిక వద్ద ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 

More Telugu News