Andhra Pradesh: రైతులకు ఇంకా రూ.8,000 కోట్లు ఇవ్వాలి.. మొత్తం ఎన్నికలకు ముందే చెల్లించేస్తాం!: మంత్రి సోమిరెడ్డి

  • మాఫీ చేశాకే ఎన్నికలకు వెళదామని సీఎం చెప్పారు
  • ఎన్ని ఇబ్బందులు ఉన్నా రూ.24 వేల కోట్లు ఇచ్చాం
  • అసెంబ్లీలో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి

రైతులకు రుణమాఫీ చేశాకే ఎన్నికలకు వెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నాలుగు, ఐదు విడతల్లో 10 శాతం వడ్డీ కలిపి రూ.8,000 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవివర సమాధానాలు ఇచ్చారు.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కేంద్రం సహకరించకపోయినా రైతులకు రూ.24 వేల కోట్లు ఇచ్చామని సోమిరెడ్డి తెలిపారు. 23.76 లక్షల కుటుంబాలకు రూ.50,000లోపు రుణమాఫీ చేశామన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీలో 2.39 లక్షల మంది కౌలు రైతులకు సైతం రుణాలను మాఫీ చేశామని చెప్పారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఆధార్, రేషన్ కార్డుల అప్ లోడ్ లో నిర్లక్ష్యం కారణంగా ఆరు జిల్లాల్లో 19,445 మందికి రుణమాఫీ జరగలేదని అన్నారు. గ్రీవెన్స్ డే సందర్భంగా వీరిని గుర్తించి రూ.52.45 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

More Telugu News