Andhra Pradesh: ప్రధాని మోదీది మాటల గారడి.. జగన్ ది మోసాల గారడి!: ఏపీ సీఎం చంద్రబాబు

  • మోదీ పార్లమెంటులో దారుణంగా మాట్లాడుతున్నారు
  • కల్తీ కూటమి అనడం దిగజారుడుతనమే
  • టీడీపీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో దారుణంగా మాట్లాడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏపీకి తగిలిన గాయంపై ఆయన కారం చల్లుతున్నారని మండిపడ్డారు. 23 విపక్ష పార్టీలను మహా కల్తీ కూటమిగా అభివర్ణించడం దిగజారుడుతనమేనని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ మోసాన్ని టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ లోక్ సభలో సూటిగా ఎండగట్టారని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో ఈరోజు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పనిచేసే కార్యకర్తలకు టీడీపీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తెలిపారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి షరీఫ్ శాసనమండలి చైర్మన్ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. ఏపీలో ప్రస్తుతం 80 శాతం ప్రజలు టీడీపీ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు. రాగద్వేషాలకు అతీతంగా, వాస్తవాలకు దగ్గరగా ఎన్నికలకు వెళుతున్నామని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విభేదాలు సహజమనీ, కానీ అందరూ పార్టీకి విశ్వాసంగా ఉండాలని సూచించారు. టీడీపీలో చిట్టచివరి కార్యకర్తకు కూడా న్యాయం చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

ఈ నెల 11న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దీక్ష చేస్తానని చంద్రబాబు తెలిపారు. అదే రోజున ఢిల్లీలో జరిగే ధర్మపోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, ప్రజాసంఘాలు రాష్ట్రంవైపు ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల వైపు ఉన్నాయని విమర్శించారు. ప్రధాని మోదీది మాటల గారడి అయితే ప్రతిపక్ష నేత జగన్ ది మోసాల గారడి అని దుయ్యబట్టారు. ఈ ఆందోళనకు ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలనీ, రాకపోతే ప్రజలే నిర్ణయించుకుంటారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

More Telugu News