Andhra Pradesh: కొన్ని శక్తులు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయ్.. అర్ధరాత్రి చెప్పకుండా లోకేశ్ టూర్ ను క్యాన్సిల్ చేసేశారు!: ఆమంచి ఆగ్రహం

  • వైసీపీ నేతలతో 10 రోజులుగా చర్చిస్తున్నా
  • తోట త్రిమూర్తులతో కులపరమైన చర్చలు జరిపా
  • ఏపీ సీఎంతో భేటీ అయిన ఆమంచి కృష్ణమోహన్

వైసీపీ నేతలతో గత 10 రోజులుగా చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేనని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. తోట త్రిమూర్తులతో రాజకీయ-కులపరమైన చర్చలు జరిపానని ఆయన అంగీకరించారు. ప్రకాశం జిల్లాలో తనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఈరోజు కలుసుకున్న అనంతరం ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడారు.

తాను వైసీపీ అధినేత జగన్ ను ఇంతవరకూ కలుసుకోలేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో ఓ కార్యక్రమం సందర్భంగా మంత్రి లోకేశ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామన్నారు. అయితే కొందరు సొంత పార్టీ నేతలు అర్ధరాత్రి ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయించారని మండిపడ్డారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పేపర్, టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చామనీ, ప్రజలు భారీగా తరలివచ్చారని గుర్తుచేశారు.

ఎమ్మెల్యేగా ఉన్న తనకు చెప్పకుండా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయించారని, తాను ఏమన్నా పాకిస్థాన్ లో ఉన్నానా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కొన్ని శక్తులు ప్రకాశం జిల్లాలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని పునరుద్ఘాటించారు. ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాననీ, తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

More Telugu News