himachalpradesh: నమో టీ షర్ట్‌లతో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు...కాంగ్రెస్‌ అభ్యంతరం

  • సభా సంప్రదాయానికి విరుద్ధమని విమర్శ
  • అసెంబ్లీలో పార్టీ ప్రచారంపై మండిపాటు
  • హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభలో కలకలం

 హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలో గురువారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు 'మళ్లీ మోదీనే' (నమో ఎగైన్‌) అని రాసివున్న టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. పవిత్ర చట్ట సభలో పార్టీ ప్రచారం ఏమిటంటూ ఈ చర్యపై కాంగ్రెస్‌ మండిపడింది.

వివరాల్లోకి వెళితే... రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు వినోద్‌కుమార్‌, సుదీందర్‌శౌరిలు మోదీ ప్రచార టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీకి వచ్చారు. పార్టీ ప్రచారం కోసమే తామిలా వచ్చామని వారు స్పష్టం చేయడంతో సభాసంద్రాయాలను మంటగలిపారని విపక్ష కాంగ్రెస్‌ నాయకుడు ముఖేష్‌ అగ్నిహోత్రి ఆగహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సభ్యులు కూడా వ్యతిరేకించడంతో చీఫ్‌ విప్‌ జగత్‌సింగ్‌ నేగి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ డాక్టర్‌ రాజీవ్‌బిందాల్‌ ఇకపై ఈ విధమైన వస్త్రధారణతో అసెంబ్లీకి రావద్దని హెచ్చరించడంతో వారు బయటకు వచ్చేశారు.

అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గతంలో హమీర్‌పూర్‌ బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ నమో ఎగైన్‌ టీ షర్ట్‌ ధరించి పార్లమెంటుకు వచ్చారని, తాము అసెంబ్లీకి వస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ అంశం అసెంబ్లీ లాబీల్లోను, ఆ రాష్ట్రంలోను చర్చనీయాంశంగా మారింది.

More Telugu News