Hyderabad: బర్కత్ పురా ఘటనలో ప్రేమోన్మాది భరత్ అరెస్ట్

  • నిందితుడిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది 
  • భరత్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశాం
  • భరత్ కు నేర చరిత్ర లేదు: డీసీపీ రమేశ్

హైదరాబాద్ లోని బర్కత్ పురా ఘటనలో ప్రేమోన్మాది భరత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ రమేశ్ మాట్లాడుతూ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతన్ని అరెస్టు చేశారని, అతనిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితుడు భరత్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడని, తనను ప్రేమించడం లేదన్న కోపంతో విద్యార్థిని మధులికపై కొబ్బరి బోండం కత్తితో దాడి చేశాడని చెప్పారు. ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న మధులిక కాలేజీకి వెళ్లే సమయంలో ఈ దాడి జరిగిందని అన్నారు.

 దాడి అనంతరం, కొబ్బరిబోండం కత్తిని తన ఇంట్లో పెట్టి భరత్ పారిపోయాడని, భరత్ తమ కస్టడీలో ఉన్నారని చెప్పారు. నిందితుడు భరత్ కు నేర చరిత్ర లేదని, అతన్ని ప్రశ్నించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు. విద్యార్థిని మధులికపై దాడి చేసేందుకు నిందితుడు భరత్ ఉపయోగించిన కొబ్బరి బోండం కత్తిని, అతను వినియోగించిన సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మధులిక ఇంటికి సమీపంలోనే భరత్ ఇల్లు కూడా ఉందని, బాధితురాలు స్పృహలోకి వచ్చాక పూర్తి వివరాలు తెలుసుకుంటామని అన్నారు.

More Telugu News