ప్రేమకు నో చెప్పిన ఇంటర్ అమ్మాయి.. నడి రోడ్డుపై కొబ్బరి బోండాల కత్తితో వెంటాడి నరికిన యువకుడు!

06-02-2019 Wed 11:12
  • తెలంగాణలోని హైదరాబాద్ లో ఘటన
  • ప్రేమ పేరుతో యువతికి వేధింపులు
  • పరిస్థితి విషమంగా ఉందంటున్న వైద్యులు
తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని బర్కత్ పురా సత్యానగర్ ప్రాంతానికి చెందిన మధులిక అనే అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఈ నేపథ్యంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తనను ప్రేమించాలని మధులికను కొంతకాలంగా వేధిస్తున్నాడు. అయితే యువతి ఇందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు కళాశాలకు వెళుతుండగా మరోసారి మధులికను అడ్డుకున్న నిందితుడు.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు బాధితురాలు ససేమిరా అంది.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు యువకుడు వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో మధులిక మెడపై వేటు వేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ దారుణాన్ని చూసిన చుట్టపక్కలవారు వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని మలక్ పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.