kolkata: విచారణకు హాజరుకావాల్సిందే.. అరెస్ట్ మాత్రం చేయకండి!: 'కోల్ కతా పోలీస్ కమీషనర్- సీబీఐ' వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాలు

  • కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను సీబీఐ అరెస్ట్ చేయరాదు
  • సీబీఐ విచారణకు రాజీవ్ కుమార్ సహకరించాలి 
  • సుప్రీం తీర్పు ప్రజాస్వామ్య విజయమన్న మమత

కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని, అరెస్ట్ చేయకూడదని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సీబీఐ విచారణకు రాజీవ్ శుక్లా సహకరించాలని ఆదేశించింది. తటస్థ ప్రదేశమైన షిల్లాంగ్ లో ఆయన సీబీఐ విచారణకు హాజరు కావాలని తెలిపింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి ఫిబ్రవరి 18లోగా సమాధానం చెప్పాలని పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలను ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. శారదా చిట్ ఫండ్, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాంల  కేసుకు సంబంధించి ఆధారాలను నాశనం చేశారని, నిందితులను పోలీస్ కమీషనర్ కాపాడుతున్నారంటూ సీబీఐ ఆరోపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు, సుప్రీంతో తీర్పుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని ఆమె హర్షం వ్యక్తం చేశారు. వివాదం వివరాల్లోకి వెళ్తే... శారదా, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాంలపై రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక టీమ్ గతంలో విచారణ జరిపింది. అయితే సంబంధిత కంపెనీలను రాజీవ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ కాపాడిందని, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని... ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలతో పోలీసులు కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ మేరకు సుప్రీంకు అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి ఆధారాలను తమకు అందజేయలేదని, ఆధారాలను తారుమారు చేశారని రాజీవ్ కుమార్ పై అఫిడవిట్ లో ఆరోపించింది.

ఈ నేపథ్యంలో, గత ఆదివారం రాజీవ్ కుమార్ నివాసం వద్దకు వెళ్లిన సీబీఐ అధికారులను కోల్ కతా పోలీసులు అదుపులోకి తీసుకుని, కొన్ని గంటల పాటు నిర్బంధించిన సంగతి తెలిసిందే. దీంతో, సీబీఐ ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆదివారం సాయంత్రం నుంచి ధర్నాకు దిగారు. కోల్ కతా పోలీస్ చీఫ్ పై తీసుకుంటున్న చర్యలు రాజ్యాంగాన్ని నీరుగార్చడమేనని ఆమె మండిపడ్డారు.

సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ సందర్భంగా... సీబీఐకి రాజీవ్ కుమార్ నేతృత్వలోని సిట్ ఇచ్చిన డేటాలో పూర్తి వివరాలు లేవని సీబీఐ తరపున వాదించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. మిస్ అయిన డాక్యుమెంట్లపై ప్రశ్నించాలని సీబీఐ యత్నించిందని... గత రెండేళ్లుగా పలుమార్లు సమన్లు పంపినా రాజీవ్ కుమార్ స్పందించలేదని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఈసీ నిర్వహించిన సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదని తెలిపారు. ఇదే సమయంలో, ఆయన పరారీలో ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయని చెప్పారు.

ఈ వాదలన్నీ విన్న తర్వాత సీబీఐ కీలక ఆదేశాలను జారీ చేసింది. రాజీవ్ కుమార్ ను సీబీఐ అరెస్ట్ చేయరాదని... ఇదే సమయంలో సీబీఐ విచారణకు ఆయన సహకరించాలని ఆదేశించింది.

More Telugu News