gvl: జీవీఎల్ పై టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసులో ఏముందంటే..!

  • చంద్రబాబును అసెంబ్లీ రౌడీ అంటూ వ్యాఖ్యానించిన జీవీఎల్
  • స్పీకర్ కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన శ్రవణ్ కుమార్
  • జీవీఎల్ వ్యవహారాన్ని సభాహక్కుల కమిటీకి అప్పగించాలంటూ విన్నపం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 'అసెంబ్లీ రౌడీ' అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, జీవీఎల్ పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలకు టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సభాహక్కుల నోటీసును ఇచ్చారు. ఆ నోటీసులో ఏముందంటే...

'ముఖ్యమంత్రి చంద్రబాబును 'అసెంబ్లీ రౌడీ' అంటూ ఫిబ్రవరి 2న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఫ్రస్ట్రేషన్, ఓటమి భయంలో ఉన్న చంద్రబాబు బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, మాణిక్యాల రావులను బెదిరించారంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తన చూస్తుంటే ఆయన పిచ్చి పీక్స్ కు చేరినట్టుందని, అసెంబ్లీ రౌడీలా ప్రవర్తించారని ఆయన వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ రూల్స్ ఆఫ్ ప్రొసిజర్ ఆఫ్ కండక్ట్ కు ఇది విరుద్ధం. జీవీఎల్ వ్యాఖ్యలు అసెంబ్లీ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి. పార్లమెంటులోని పెద్దల సభలో సభ్యుడిగా ఉంటున్న జీవీఎల్ తీరు చట్టసభలను గౌరవించేలా ఉండాలి. కానీ ఆయన చట్టసభల గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరచడం ద్వారా సభాహక్కుల ఉల్లంఘనకు జీవీఎల్ పాల్పడ్డారు. అందువల్ల ఈ కేసును తక్షణమే సభాహక్కుల కమిటీకి అప్పగించండి. జీవీఎల్ పై చర్యలు తీసుకునే విధంగా తక్షణమే కార్యాచరణను ప్రారంభించాలని కోరుతున్నాను.'

More Telugu News