Tollywood: హీరో రాజశేఖర్ సోదరుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

  • ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన
  • రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్
  • కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి దాడి చేశారని ఆరోపణ
ప్రముఖ హీరో రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బంజారా హిల్స్ లోని ఏసీపీ కార్యాలయానికి జీవిత, గుణశేఖర్ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో జీవిత మాట్లాడుతూ, రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ కు రోడ్ నెంబర్ 45లో ‘గుణాస్ డైమండ్స్’ అనే షోరూమ్ ఉందని అన్నారు.

ఇటీవలే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు శనివారం రాత్రి ఆ షోరూమ్ వద్ద గుణశేఖర్ పై శారీరకంగా దాడి చేశారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తన కారును గుణశేఖర్ షాపు వద్ద పార్కింగ్ చేసి ఎక్కడికో వెళ్లిపోయారని, ఈ విషయమై ప్రశ్నించిన గుణశేఖర్ పై ఆయన దాడి చేశాడని ఆరోపించారు.

ఈ విషయమై ఏసీపీకి వివరించి చెప్పేందుకు తాను ఇక్కడికి వచ్చానని, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్ లను పోలీసులకు, మీడియాకు అందజేస్తామని అన్నారు. కౌశిక్ రెడ్డి కొట్టిన దెబ్బలతో గుణశేఖర్ దాదాపు స్పృహ కోల్పోయారని, తీవ్ర జ్వరం వచ్చిందని, నిన్న రాత్రి వరకు ఆయన లేవలేని పరిస్థితి అని అన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు చెప్పారని జీవిత పేర్కొన్నారు.
Tollywood
jeevita rajashekar
gunashekar
guna diamonds
jubli hills
rajashekar

More Telugu News