APS RTC: నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త నిర్ణయం!

  • పార్శిళ్లను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం
  • ఇప్పటికే ప్రయోగాత్మకంగా విజయవాడలో అమలు
  • రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు టెండర్ల ఆహ్వానం

నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త సేవల దిశగా అడుగులు వేస్తోంది. ప్రాంతంతో పనిలేకుండా పార్శిళ్లను కావాల్సిన చోటికి డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బస్సులను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడలో ఇంటింటికీ పార్శిళ్లను చేరవేసే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఆర్టీసీ దీనిని మరింత విస్తరించాలని యోచిస్తోంది.

భారీ ఎత్తున సరుకులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా బాగా ఆర్జించవచ్చని, తద్వారా నష్టాల బారి నుంచి సంస్థను గట్టెక్కించవచ్చని భావిస్తోంది. ఇందుకోసం డెలివరీ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలని భావించి టెండర్లు కూడా ఆహ్వానించింది. త్వరలోనే వీటిని ఖరారు చేసి విజయవాడలో పెద్ద ఎత్తున పార్శిళ్లను డోర్ డెలివరీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.  

నిజానికి ఏపీఎస్ ఆర్టీసీ 2017-18లో  కృష్ణా జిల్లాలో పార్శిల్, కొరియర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ఏడు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 12 కోట్లు సంపాదించింది. ఆర్టీసీ బస్సులు ప్రతి పల్లెకు వెళ్తుండడంతో దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ఏ ప్రాంతానికైనా ఒక్క రోజులోనే డెలివరీ చేసే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.  

More Telugu News