yadadri: యాదాద్రి దివ్య క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది: సీఎం కేసీఆర్

  • ఆలయ పనులు శర వేగంగా జరుగుతున్నాయి
  • వెయ్యి ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మాణం జరుగుతోంది
  • ఆలయ ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తాం

తెలంగాణలోని యాదాద్రి దివ్య క్షేత్రంగా రూపుదిద్దుకుంటోందని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. యాదాద్రి క్షేత్రాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. విహంగ వీక్షణం ద్వారా ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం, లక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఆలయ నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయని, చినజీయర్ స్వామి సలహాలతో ఆలయ నిర్మాణం దివ్యంగా జరుగుతోందని అన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఏడంతస్తుల గోపురం కూడా శిల్పాలతోనే కట్టామని చెప్పారు. కృష్ణ శిలలతో చెక్కిన శిల్పాలు అందంగా, అబ్బురపరిచే విధంగా ఉన్నాయని అన్నారు.

మొత్తం వెయ్యి ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మాణం జరుగుతోందని, ఉత్తర భాగంలో ఆలయం కింది వైపు నుంచి స్థల సేకరణ జరుగుతోందని, ఇందుకోసం రూ.70 కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. 250 ఎకరాల్లో 350 క్వార్టర్లు నిర్మిస్తామని, ఇందుకోసం 45 మంది దాతలు ముందుకొచ్చారని, నిత్యాన్నదానం సత్రం నిర్మాణం నిమిత్తం రూ.10 కోట్ల విరాళాలొచ్చాయని చెప్పారు.

యాభై ఎకరాల్లో ప్రవచన మంటపం నిర్మిస్తామని, గంథమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, 133 దేశాల నుంచి వైష్ణవ ఆరాధకులు వస్తారని, 1008 హోమగుండాలతో ఈ ప్రారంభోత్సవం జరుగుతుందని, యాదాద్రి ప్రపంచంలోనే యూనిక్ టెంపుల్ కానుందని అన్నారు. అష్టాదశ పీఠాల్లో అలంపూర్ లోని జోగులాంబ ఆలయం ఒకటని, గత పాలకులు ఈ శక్తి పీఠాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.  

More Telugu News