modi: దేశానికి మళ్లీ నేనే ప్రధాని: మోదీ

  • కాంగ్రెస్ పాలనలో జమ్ముకశ్మీర్ నిరాదరణకు గురైంది
  • బీజేపీ పాలనలో అభివృద్ధి ఇలాగే కొనసాగుతుంది
  • విభజన రాజకీయాలను పారదోలాం

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని... ప్రధానిగా మరోసారి తానే బాధ్యతలను చేపట్టబోతున్నానని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ లో ఈరోజు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లేహ్ లో ఆయన మాట్లాడుతూ, తన చేతుల మీదుగా ఈరోజు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయని... వాటి ప్రారంభోత్సవాలను కూడా తానే చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో జమ్ముకాశ్మీర్ పూర్తిగా నిరాదరణకు గురైందని తెలిపారు. బీజేపీ పాలనలో అభివృద్ధి ఇలాగే కొనసాగుతుందని చెప్పారు.

ఈ ఐదేళ్ల పాలనలో విభజన రాజకీయాలను, లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని పారదోలామని మోదీ అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ఆలస్యం లేకుండా వేగంగా అందజేసే ప్రక్రియను చేపట్టామని చెప్పారు. మొదటి విడత సాయంగా ఐదు ఎకరాల్లోపు రైతులకు రూ. 2 వేలు అందిస్తామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల పేర్లు, ఆధార్ నంబర్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేశామని చెప్పారు.

More Telugu News