Venkaiah Naidu: సంచలనం కోసం వార్తలు రాస్తారా?: ఉప రాష్ట్రపతి వెంకయ్య ఆవేదన

  • ఒకప్పుడు సామాజిక సమస్యలు పారదోలేందుకు వార్తలు రాసేవారు
  • ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం రాస్తున్నారు
  • జర్నలిజం మౌలిక స్వరూపం దెబ్బతింది

ప్రస్తుతం మీడియా అనుసరిస్తున్న వైఖరిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాత్రికేయ వృత్తి ఓ మిషన్‌లా ఉండేదని, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను పారదోలేందుకు భయం లేకుండా వార్తలు రాసేవారని వెంకయ్య గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైందని అన్నారు. సంచలనం కోసం ప్రయత్నించడం, పెయిడ్ ఆర్టికల్స్, పక్షపాత వైఖరి నేటి పాత్రికేయానికి పెద్ద శాపాలుగా పరిణమించాయన్నారు. కొల్లాం ప్రెస్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ప్రారంభ వేడుకలలో ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తామేం చేస్తున్నామన్న దానిపై ఫోర్త్ ఎస్టేట్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  సంచలనం కోసం ప్రయత్నించడం, చెల్లింపు వార్తలు, పక్షపాత వైఖరితోపాటు నకిలీ వార్తలు కూడా జర్నలిజానికి పెను సమస్యగా పరిణమించాయన్నారు. బ్రిటిష్ పాలనలోను, ఎమర్జెన్సీ సమయంలోను వార్తా పత్రికలు కీలక పాత్ర పోషించాయని వెంకయ్య గుర్తు చేశారు.

వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు.. ఇలా ఎవరికిపడితే వారు స్వప్రయోజనాల కోసం సొంతంగా మీడియాను ఏర్పాటు చేసుకోవడం వల్ల జర్నలిజం మౌలిక స్వరూపం దెబ్బతింటోందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రచురించే వార్తల్లో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఇష్టారీతిన వార్తలు రాయకుండా మీడియా సంస్థలు నియంత్రణ పాటించాలని ఉప రాష్ట్రపతి కోరారు.  

More Telugu News