numayush: నాంపల్లి ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభం.. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి సందర్శకులకు అనుమతి

  • రెండు రోజుల క్రితం అగ్నిప్రమాదంతో భస్మీపటలమైన స్టాల్స్‌
  • దాదాపు రూ.30 కోట్ల వరకు నష్టం
  • శరవేగంగా కొత్త స్టాల్స్‌ నిర్మిస్తున్న సిబ్బంది

హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో నుమాయిష్‌  పునఃప్రారంభానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరిగి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు అధికారులు, సిబ్బంది పనులు చేపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఈ మైదానంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 303 స్టాళ్లు మంటల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ప్రమాదంలో దాదాపు 30 కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం జరిగింది.

దీంతో ప్రదర్శన తిరిగి ప్రారంభించేందుకు సొసైటీ ప్రతినిధులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దాదాపు 300 మంది సిబ్బంది, ఇతర యంత్రాంగంతో కూలిన షెడ్డులు తొలగించి స్టాల్స్‌ నిర్మాణం పూర్తిచేసే పనులు చేపట్టారు. శుక్రవారం సాయంత్రానికి వంద స్టాళ్ల నిర్మాణం పూర్తిచేశారు. ఏకబిగిన పనులు కొనసాగించి నేటి మధ్యాహ్నానికి పనులు పూర్తి చేయాలని సిబ్బంది యోచన. ప్రమాదం జరిగే రోజు వరకు నుమాయిష్‌ వస్తుప్రదర్శన కేంద్రాన్ని 10,61,294 మంది సందర్శించారు. ప్రమాదం జరిగిన రోజు 21 వేల మంది వచ్చారు. ఇంత భారీ సంఖ్యలో సందర్శకులు ఉన్నా అగ్నిప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడం అదృష్టమనే చెప్పాలి.

ప్రమాదం జరిగిన తరువాత బాధిత వ్యాపారులకు, వారి కుటుంబాలకు సమీపంలోని వనితా డిగ్రీ కళాశాల, ఎగ్జిబిషన్‌ మైదానంలోని కమలానెహ్రూ పాలిటెక్నిక్‌ కళాశాలలో సొసైటీ భోజన ఏర్పాట్లు చేసింది. జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తాజాగా కొన్ని భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాద హేతువులైన ఎటువంటి పదార్థాలను స్టాల్స్‌లో ఉంచవద్దని, విద్యుత్‌, గ్యాస్‌ స్టౌవ్ లు వాడితే కఠిన చర్యలు తప్పవని స్టాల్‌ నిర్వాహకులను హెచ్చరించినట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి జి.వి.రంగారెడ్డి తెలిపారు.

అన్ని స్టాళ్లకు బీమా కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో నష్టపోయిన స్టాళ్ల యజమానులు ఒక్కొక్కరికి రూ.35 వేల చొప్పున రూ.కోటి వరకు పరిహారం అందించినట్లు చెప్పారు. ఎగ్జిబిషన్‌ను ఈనెల 28వ తేదీ వరకు కొనసాగించాలని యోచిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

More Telugu News