Vijayashanthi: చిరంజీవికి విజయశాంతి లేఖ.. ఏపీ పార్టీలు ఆ లాజిక్‌ను మిస్సవుతున్నాయన్న 'రాములమ్మ'!

  • ప్రత్యేక హోదా కోసం విడివిడిగా పోరాడడం మానండి
  • అందరూ కలిసి వస్తే బీజేపీ మెడలు వంచొచ్చు
  • హోదా కలను నిజం చేసేందుకు చిరంజీవి ముందుకు రావాలి

కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ నటి విజయశాంతి ట్విట్టర్‌లో మాజీ మంత్రి చిరంజీవికి చేసిన సూచన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేక హోదాపై ఎవరికి వారు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు తప్పితే ఏకతాటిపైకి వచ్చి బీజేపీతో పోరాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు.  

ప్రత్యేక హోదా కోసం అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ వాదులాడుకుంటున్నాయి తప్పితే రెండూ కలిసి బీజేపీపై మాత్రం పోరాడడం లేదన్నారు. వైసీపీ, జనసేన విషయంలోనూ ఇదే జరుగుతోందన్నారు. లక్ష్యసాధన కోసం కలిసి రాలేని పార్టీలు బీజేపీపై ఎలా ఒత్తిడి తీసుకురాగలుగుతాయని విజయశాంతి ప్రశ్నించారు.  

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను బలపర్చకుండా ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న లాజిక్‌ను అన్ని పార్టీలు మిస్సవుతున్నాయని విజయశాంతి అన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఇప్పటికే తీర్మానం కూడా చేసిందని గుర్తు చేశారు. కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే అన్ని ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి రావాలన్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మంచి పాప్యులారిటీ ఉన్న నేత చిరంజీవి లాంటి ప్రముఖులంతా ఏపీ ప్రజల ప్రత్యేక హోదా కలలను నిజం చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కూడా ఇదే మంచి   తరుణమని విజయశాంతి అభిప్రాయపడ్డారు. లేదంటే, ఆపరేషన్‌లు, ఆందోళనలు విజయవంతమై ప్రత్యేక హోదా మరుగున పడిపోతుందని అన్నారు. ఓ నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఇది తన అభిప్రాయం మాత్రమేనని విజయశాంతి పేర్కొన్నారు.  

More Telugu News