Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. నిరుద్యోగ భృతిని రూ.2,000కు పెంచనున్న ప్రభుత్వం!

  • ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపై కీలక నిర్ణయం
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అమలుచేస్తాం
  • అమరావతిలో ముగిసిన టీడీఎల్పీ భేటీ

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని టీడీపీ అధినేత ఎమ్మెల్యేలకు సూచించారు. అలాగే యువతకు అందజేస్తున్న నిరుద్యోగ భృతిని రెట్టింపు చేస్తామని వెల్లడించారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.వెయ్యిని రూ.2,000కు పెంచుతామని పేర్కొన్నారు. వీటిని అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అమలుచేస్తామన్నారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నందున పనులన్నీ పూర్తిచేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

కాగా, ఫిబ్రవరి చివరికల్లా అభ్యర్థుల ఎంపికను పూర్తిచేస్తామని సీఎం అన్నారు. ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతటా బస్సుయాత్ర చేపట్టాలా? లేక రోజూ రెండు జిల్లాల చొప్పున పర్యటించాలా? అనే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు టీడీఎల్పీ సమావేశం ముగిసిన నేపథ్యంలో మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పసుపు-కుంకుమ పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది.

More Telugu News