Andhra Pradesh: తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏపీ భవిష్యత్ అంధకారమే!: సీఎం చంద్రబాబు హెచ్చరిక

  • ఏపీలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నాలు
  • టీడీపీ సభ్యులు పార్లమెంటులో ఇంకా పోరాడాలి
  • టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ గరవ్నర్ నరసింహన్ నిన్న చేసిన ప్రసంగం రాష్ట్రం నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గవర్నర్ ప్రసంగం నిదర్శనమని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో టీడీపీ సభ్యులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ఆదేశించారు. ఢిల్లీలో జరిగే ధర్మపోరాట దీక్షలకు అందరూ సిద్ధం కావాలని ఏపీ సీఎం పిలుపునిచ్చారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఫిబ్రవరి 1న ఏపీ బంద్ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలపాలని చంద్రబాబు సూచించారు. ప్రజల మనోభావాల ప్రకారమే టీడీపీ నడుచుకుంటుందనీ, ప్రజా సాధికారతే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. టీడీపీ వల్లే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నిలదొక్కుకోగలిగిందని స్పష్టం చేశారు. నిన్న అఖిలపక్ష సమావేశం టీడీపీ చేపట్టిన అభివృద్ధికి సంఘీభావమని అన్నారు.

వైసీపీతో కలిసి బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందనీ, ఏపీ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తోందన్నారు. అటు కేసీఆర్, ఇటు జగన్ ఏపీకి నష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాకుండా అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదే జరిగితే ఏపీ భవిష్యత్ అంధకారమయం అయిపోతుందని హెచ్చరించారు.

More Telugu News