AP cabinet meet: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి వర్గం కీలక భేటీ నేడు

  • మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం
  • పెన్షన్ల పండుగ, డ్వాక్రా చెక్కులు వంటి అంశాలపై నిర్ణయం
  • అగ్రిగోల్డ్‌ అంశంపైనా చర్చ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు భేటీకానుంది. చివరి అసెంబ్లీ సమావేశాలు (స్పీకర్‌ ప్రకటన మేరకు) జరుగుతుండడం, ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న పెన్షన్ల పండుగ, డ్వాక్రా చెక్కు పంపిణీ, గృహప్రవేశాలపై చర్చించనున్నారు.

అలాగే, రైతుకు తక్షణ సాయంగా రూ.2500 ఇవ్వాలని, వచ్చే ఏడాది నుంచి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించడంతో ఈ పధకానికి పేరు నిర్ణయించే అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. కౌలు రైతులకు సాయం అందించాలని భావిస్తుండడంతో ఇందుకు సరైన పేర్లను ఎంపిక చేసే అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం చెల్లింపుపైనా చర్చిస్తారు. అదేవిధంగా, విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం మొండిచెయ్యి చూపించడం, ప్రత్యేక హోదా కోసం చేపట్టనున్న నిరసన కార్యక్రమాల కార్యాచరణ ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా ఉద్యమ కారులపై కేసులు ఎత్తివేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

More Telugu News