Numayish: నుమాయిష్ ఘోరం... 2,500 దుకాణాల్లో 400 అగ్నికి ఆహుతి... వందల కోట్ల ఆస్తి నష్టం!

  • గత రాత్రి 7.30 గంటల సమయంలో ప్రమాదం
  • రాత్రి 2 గంటల వరకూ కూడా అదుపులోకిరాని మంటలు
  • బోరున విలపిస్తున్న దుకాణదారులు

హైదరాబాద్, నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గత రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం ఏర్పడింది. రాత్రి, 2 గంటల వరకూ కూడా మంటలు అదుపులోకి రాలేదంటే ఎంత భారీ ప్రమాదం జరిగిందో ఊహించుకోవచ్చు. ఎగ్జిబిషన్ లో మొత్తం 2,500 స్టాల్స్ ఉండగా, 175 స్టాల్స్ లో ఒక్క చిన్న వస్తువు కూడా మిగల్లేదు. మరో 225 స్టాల్స్ పాక్షికంగా దహనమయ్యాయి. వందలాది మంది ఉత్తర భారతీయులు ఏర్పాటు చేసుకున్న స్టాల్స్ చూస్తుండగానే బూడిదయ్యాయి. దీంతో ఆ స్టాళ్ల యజమానులు బోరున విలపించారు. దగ్ధమైన స్టాళ్లలో చేనేత, దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, చెప్పుల స్టాల్స్ అధికంగా ఉన్నాయి.

మంటలు ఒక్కో దుకాణానికీ వ్యాపిస్తుంటే, ఆయా దుకాణాల నిర్వాహకులు వంట చేసుకునేందుకు తెచ్చుకున్న చిన్న చిన్న గ్యాస్ సిలిండర్లు పేలిపోయి భారీ శబ్దాలు వినిపించాయి. సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో జైళ్లు, ఆంధ్రాబ్యాంక్ స్టాళ్ల సమీపం నుంచి మంటలు మొదలుకాగా, హెచ్పీ గ్యాస్, పిస్తా హౌస్ మధ్య ఉన్న స్టాల్స్ కు శరవేగంగా వ్యాపించాయి.

మంటలను చూసిన సందర్శకులు బయటకు పరుగులు పెట్టడంతో స్వల్ప తొక్కిసలాట జరిగి, సుమారు 15 మందికి గాయాలు అయ్యాయి. అప్పటివరకూ ఆనందంగా ఉన్న ప్రదర్శనలో ఒక్కసారిగా పరిస్థితి భీతావహంగా మారింది. కొన్ని వందల కోట్ల నష్టం వాటిల్లివుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దుకాణాల నిర్వాహకులను ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

More Telugu News