Andhra Pradesh: సమాజం దేవాలయం అయితే ఏపీ అసెంబ్లీని దయ్యాల కొంపగా భావించాలా?: వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి

  • గవర్నర్ చేత 40 పేజీల అబద్ధాలు చదివించారు
  • దాన్ని వినాల్సి రావడం ఏపీ ప్రజల దురదృష్టం
  • కోడెల స్పీకర్ గౌరవాన్ని కాలరాస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ఈరోజు చేసిన ప్రసంగంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి పెదవి విరిచారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ చేత 40 పేజీల అబద్ధాలను చదవించారని దుయ్యబట్టారు. ఈ టీడీపీ కరపత్రం చదవాల్సి రావడం నిజంగా గవర్నర్ దురదృష్టకరమనీ, దాన్ని వినాల్సి రావడం ఏపీ ప్రజల దురదృష్టమని చెప్పారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు. మరి అసెంబ్లీ అంటే దయ్యాల కొంపనా? అని ప్రశ్నించారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ఇలాంటి చర్యలతో ఏపీ అసెంబ్లీని దయ్యాల కొంపగానే భావించాల్సిన పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. ఏపీ స్పీకర్ కోడెల టీడీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు.

జపాన్‌, సింగపూర్‌ తరహాలో రాష్ట్రం అభివృద్ధి చెందిందనీ, జాతీయ సగటు కంటే ఏపీ వృద్ధి రేటు ఎక్కువని గవర్నర్ ప్రసంగంలో చెప్పడాన్ని తప్పుపట్టారు. ఏపీ వృద్ధి రేటు 55 శాతం పెరిగినట్లు నిరూపించగలరా? అని ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఎన్నికలకు ముందు ప్రజలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు. నాడు హంద్రీనీవా అవసరమే లేదని చంద్రబాబు అన్నారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే హంద్రీనీవా, గాలేరు పనులు జరిగాయని గుర్తుచేశారు.

More Telugu News