Groundnut Oil: ఒకటి, రెండు కాదు... పల్లీల పేరు చెప్పి రూ. 100 కోట్లకు పైగా నొక్కేసిన శ్రీకాంత్!

  • రెండు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీకాంత్ రెడ్డి
  • 1991 నుంచి అమాయకులను మోసం చేయడమే పని
  • శ్రీకాంత్ దందాలపై సీపీ మహేష్ భగవత్

తామిచ్చిన పల్లీలు తీసుకుని, నూనె తీసిచ్చి లక్షాధికారులు కావాలంటూ ప్రజలను మభ్య పెట్టి దారుణంగా మోసం చేసిన గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఎండీ జిన్నా కాంతయ్య అలియాస్ జిన్నా శ్రీకాంత్ రెడ్డి, దాదాపు రూ. 100 కోట్లను నొక్కేశాడని హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు. ఉప్పల్ కేంద్రంగా నడిచిన దందాపై మరిన్ని వివరాలను వెల్లడించిన ఆయన, కేవలం ఇంటర్ వరకూ చదువుకుని, ముంబైలోని ఓ లెదర్ ఫ్యాక్టరీలో కొంతకాలం పనిచేశాడని వివరించారు.

1991 ప్రాంతంలో హైదరాబాద్ కు వచ్చిన శ్రీకాంత్, సొంత వ్యాపారం ప్రారంభించాడని చెప్పారు. ఆపై నాలుగేళ్లకు కోల్ కతాకు చెందిన మితా బిశ్వాన్ ను వివాహం చేసుకుని సిగ్మా గ్రాఫిక్స్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ పేరట ఓ వ్యాపారాన్ని, ఆపై నిజామాబాద్ లో స్టాపర్స్ వరల్డ్ పేరిట అగరు బత్తీల తయారీ వ్యాపారాన్ని చేశాడని చెప్పారు. అప్పట్లోనే నిరుద్యోగులకు అగరుబత్తీల తయారీలో శిక్షణ ఇస్తానని చెప్పి రూ. 75 వేల చొప్పున వసూలు చేశాడని, పోలీసు నిఘా పెరగడంతో, హైదరాబాద్ కు వచ్చి, మహాలైఫ్ ఆన్ లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడని, తన కంపెనీలో మానవ వనరుల విభాగం మేనేజర్ గా చేరిన అహల్యా రెడ్డిని ద్వితీయ వివాహం చేసుకున్నాడని చెప్పారు.

ఆపై కర్నూలులో రియల్ దందా ప్రారంభించి, రూ. 150 కోట్లతో 350 ఎకరాల స్థలం కొనుగోలుకు ప్లాన్ వేశాడని, ఆపై గ్రీన్ గోల్డ్ బయోటెక్ ను ప్రారంభించి మోసాలకు తెరలేపాడని చెప్పారు. శ్రీకాంత్ పై హైదరాబాద్ లో 5, కడపలో 2, వరంగల్ లో ఒక కేసు రిజిస్టర్ అయి ఉన్నాయని అన్నారు. ఈ కేసులో శ్రీకాంత్ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని, అతని దందాలపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని చెప్పారు.

More Telugu News