tammareddy bharadwaja: పవన్-చంద్రబాబు కలిసిపోయారట.. సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయిందట!: 'బయట ప్రచారం'పై తమ్మారెడ్డి భరద్వాజ విశ్లేషణ

  • జనసేనకు 30 సీట్లు.. రాజ్యసభకు పవన్
  • ఈ ప్రచారంలో నిజమెంతో..! 
  • రామాయణంలో పిడకల వేటలా పవన్ పరిస్థితి 

‘నా ఆలోచన’ పేరుతో యూట్యూబ్ వీడియోలు విడుదల చేస్తున్న సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు.  ప్రస్తుతం పవన్ కల్యాణ్ పరిస్థితి రామాయణంలో పిడకల వేటలా తయారైందని అన్నారు. తాను ఎవరితోనూ పొత్తు పెట్టుకోను మొర్రో అంటున్నా ప్రచారం మాత్రం బయట వేరేలా జరుగుతోందన్నారు. తాను కమ్యూనిస్టులతోనే కలిసి ఎన్నికలకు వెళ్తానని పవన్ చెబుతుంటే.. మరోవైపు పవన్-చంద్రబాబు కలిసిపోయారని, సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయిందని, చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అన్న ప్రచారం జరుగుతోందన్నారు.

జనసేనకు 30 సీట్లు ఇచ్చి, పవన్‌ను రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుందని తమ్మారెడ్డి అన్నారు. అయితే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు చెబుతున్నా అందులో నిజానిజాలు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు-పవన్ కలుస్తున్నారని చెబుతున్న వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని, కానీ ప్రచారం మాత్రం జరిగిపోతోందని అంటున్నారు.  

ప్రచారం చేస్తున్నట్టుగా జరిగితే తాము ముందే చెప్పామని, లేకపోతే అలా ప్రచారం జరుగుతోందని మాత్రమే చెప్పామని తప్పించుకునే వీలు కూడా ఉందన్నారు. నాలుకకు రెండు వైపులా పదును ఉంటుందని, ఎలా కావాలంటే అలా మాట్లాడొచ్చని తమ్మారెడ్డి అన్నారు.

More Telugu News