నటి భానుప్రియపై తప్పుడు ప్రచారం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సోదరుడు

26-01-2019 Sat 17:47
  • భానుప్రియను అరెస్ట్ చేశారంటూ ప్రచారం
  • చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న గోపాలకృష్ణ
  • పని మనిషిని పోలీస్ స్టేషన్లో అప్పగించామని వెల్లడి
పనిమనిషిని చిత్రహింసలు పెడుతున్నారన్న కేసు నేపథ్యంలో, ప్రముఖ నటి భానుప్రియను అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆమె సోదరుడు గోపాలకృష్ణ ఫైర్ అయ్యారు. తన సోదరి గురించి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమపై ఫిర్యాదు చేసిన పనిమనిషిని చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్ లో పోలీసులకు అప్పగించామని తెలిపారు.

మరోవైపు, ఈ అంశంపై భానుప్రియ కూడా స్పందించారు. చెన్నైలో ఉన్న తమ ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి నగలు, డబ్బు, వస్తువులను దొంగిలించిందని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో... ఆమె తల్లి వాచ్ లు, కెమెరా, ఐప్యాడ్ తెచ్చిచ్చిందని... నగలు, డబ్బు మాత్రం ఇవ్వలేదని తెలిపారు. వాటిని కూడా తాము అడగడంతో తమపై తప్పుడు కేసు పెట్టారని చెప్పారు.