india: రెండో వన్డే: న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా

  • 4 వికెట్లకు 324 పరుగులు చేసిన టీమిండియా
  • 87 పరుగులు చేసిన రోహిత్ శర్మ
  • చివర్లో మెరుపులు మెరిపించిన ధోనీ, జాధవ్

మౌంట్ మాంగనీలో న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్టేలో టీమిండియా ఆటగాళ్లు సమష్టిగా రాణించి ఆతిథ్య జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 324 పరుగులు సాధించింది.

భారత బ్యాటింగ్ ను ప్రారంభించిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు తొలి వికెట్ కు ఏకంగా 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరుకు బాటలు పరిచారు. 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ బౌల్ట్ బౌలింగ్ లో లాథమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసి... ఫెర్గ్యూసన్ బౌలింగ్ లో గ్రాండ్ హోమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిగాడు.

మిగిలిన బ్యాట్స్ మెన్లలో కోహ్లీ 43, అంబటి రాయుడు 47 పరుగులు చేశారు. ధోనీ 48 (33 బంతులు), జాధవ్ 22 (10 బంతులు) పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి, నాటౌట్ గా నిలిచారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫెర్గ్యూసన్ లు చెరో 2 వికెట్లు తీశారు. కాసేపట్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభంకానుంది. 

More Telugu News