Hyderabad: బైక్ పై డ్రాప్‌ చేస్తామని చెప్పి దారిలో దోపిడీ.. 48 గంటల్లో నిందితుల అరెస్ట్

  • గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లి దోపిడీ
  • చర్లపల్లిలో జైలులో ఉన్న బావను కలిసేందుకు వచ్చిన బాధితుడు
  • ఆ సమయంలో పరిచయమైన దుండగులు

హైదరాబాద్‌ శివారు చర్లపల్లి జైలులో ఉన్న తన బావను కలిసేందుకు వచ్చిన మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినికి చెందిన వ్యక్తిని విమానాశ్రయానికి డ్రాప్‌ చేస్తామని మాయమాటలతో నమ్మించి దారిలో దోచుకున్న ఘటన ఇది. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 48 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్ కమీషనర్ అంజనీకుమార్‌ విలేకరులకు తెలిపిన వివరాల మేరకు...మధ్యప్రదేశ్‌కు చెందిన స్వప్నిల్‌ ప్రజాపతిని ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. షేర్‌మార్కెట్‌లో లాభాల ఆశచూపి ఇతను మోసానికి పాల్పడినట్టు కేసు నమోదు కావడంతో అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు పంపారు. ప్రజాపతిని కలిసేందుకు ఉజ్జయినికి చెందిన అతని బావమరిది దీపాంజయ్‌ బుండేలా ఈనెల 17న నగరానికి వచ్చి కూకట్‌పల్లిలోని ఓ లాడ్జిలో బస చేశాడు.

మరుసటి రోజు చర్లపల్లి జైలుకు వెళ్లి ములాఖత్‌లో స్వప్నిల్‌ ప్రజాపతిని కలుసుకున్నాడు. 22వ తేదీన స్వస్థలం వెళ్లేందుకు ఇండోర్‌కు విమానం టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. వెళ్లేముందు మరోసారి ప్రజాపతిని కలుద్దామని జైలుకు వెళ్లాడు. ఆ సందర్భంలో ములాఖత్‌ గదిలో బుండేలాకు సయ్యద్‌ యూనుస్‌, సయ్యద్‌ అబేదిన్లు పరిచయం అయ్యారు.

ములాఖత్‌ అయ్యాక అంతా కలిసి జైలు బయటకు వచ్చారు. తాము శంషాబాద్‌ వరకు వెళ్తున్నామని, అక్కడి నుంచి క్యాబ్‌లో విమానాశ్రయానికి పంపుతామని బుండేలాను నమ్మించడంతో  వారి బైక్‌ ఎక్కాడు. పాతబస్తీ పరిసరాలకు వచ్చాక ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ మరో నలుగురున్నారు. దీపాంజయ్‌ కీడును శంకించి తప్పించుకునేందుకు ప్రయత్నించినా దుండగులు అతడిని అడ్డుకుని కొట్టిగాయపరిచారు.

అతని వద్ద ఉన్న రెండు బంగారు ఉంగరాలు, 18 వేల నగదు దోచుకున్నారు. ఆ తర్వాత ఏటీఎం నుంచి డబ్బు విత్‌ డ్రా చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అతన్ని మిషన్‌ వద్దకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో తప్పించుకున్న దీపాంజయ్‌ కామాటిపుర పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ ఉన్న కొత్వాల్‌ అంజనీకుమార్‌కు విషయం వివరించగా, ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జైళ్ల శాఖ అధికారులతో మాట్లాడి నిందితులను గుర్తించి పట్టుకున్నారు.

More Telugu News