Andhra Pradesh: త్వరలో జగన్ గృహప్రవేశం చేస్తారట.. దానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా వస్తారట!: చంద్రబాబు

  • మోదీ, కేసీఆర్ తో జగన్ రాజీ పడ్డారు
  • డబ్బులున్న వాళ్లకు టికెట్లు ఇస్తారు
  • టెలీకాన్ఫరెన్స్ లో మండిపడ్డ ఏపీ సీఎం

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో వేర్వేరు పార్టీలతో కలిసి ఉమ్మడిపోరాటం చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘సేవ్ నేషన్-సేవ్ డెమొక్రసీ-యునైటెడ్ ఇండియా’ పేరుతో ఒకే వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు అన్నారు. కర్ణాటక, కోల్ కతాలో విపక్షాలు ఒకే వేదికపైకి వచ్చాయనీ, బెంగాల్ లో పొత్తు లేకపోయినా సీఎం మమతా బెనర్జీ సభకు కాంగ్రెస్ నేతలు వచ్చారని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన ‘ఎలక్షన్ మిషన్ 2019’ టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు.

దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు రక్షణ కల్పించడమే తమ అజెండా అని చంద్రబాబు తెలిపారు. ఏపీ మంచిని కోరే ప్రతీఒక్కరూ టీడీపీతోనే ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజల కోసం పనిచేస్తే.. వైసీపీ, బీజేపీ స్వార్థంతో పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. నేరాలు-ఘోరాలు, కుట్రలు-కుతంత్రాలు పన్నడమే వాటి విధి అని వ్యాఖ్యానించారు.

చేతకానివాళ్లు ఏపీలో అధికారంలో ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని ఆరోపించారు. తన చేతకానితనం తెలంగాణలో ఎక్కడ బయటపడుతుందో అని కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. ‘త్వరలో జగన్ గృహప్రవేశం చేస్తారట.. దానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా వస్తారట. జగన్ కేసుల మాఫీ కోసం మోదీతో, డబ్బుల కోసం కేసీఆర్ తో రాజీపడ్డారు. ఏపీని జగన్ టీఆర్ఎస్ కు తాకట్టు పెడుతున్నారు. జగన్ డబ్బు మనిషి. కేవలం డబ్బున్నవాళ్లకే టికెట్ ఇస్తాడు. ఆయన మోసాల్లో ఘనుడు. అందుకే 16 నెలలు జైలుకు వెళ్లాడు’ అని మండిపడ్డారు.

కాపు రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, వైసీపీ విమర్శలు చేస్తున్నాయని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా ఉండకూదనీ, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వీరు కోరుకుంటున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో ఈ రెండు పార్టీలు తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News