Madhya Pradesh: ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. మృతుల్లో 12 రోజుల బాలుడు.. మిస్టరీగా మారిన వైనం!

  • బొగ్గుల కుంపటితో ఊపరి ఆడక మృతి
  • హత్యలు కాదన్న పోలీసులు
  • సంచలనంగా మారిన ఘటన

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. ఐదుగురు సభ్యుల కుటుంబంలోని నలుగురు చనిపోయి కనిపించారు. మృతుల్లో ఓ మహిళ, ఆమె తల్లి (40), 12 ఏళ్ల ఆమె సోదరుడు, 12 రోజుల వయసున్న శిశువు ఉన్నారు. మృతదేహాల పక్కనే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మహిళ భర్తను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారి మృతికి గల కారణాలు తెలియనప్పటికీ బొగ్గుల కుంపటి కారణంగా ఊపిరి ఆడక మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్యలైతే కాకపోయి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే, మహిళ చేతిపై గాయాలు ఉండడంతోపాటు ఆమె నోటి నుంచి నురుగ రావడం అనుమానాలకు తావిస్తోంది.

సోమవారం రాత్రి వారిని చివరిసారిగా చూశామని ఇరుగుపొరుగు వారు చెప్పారు. మంగళవారం సాయంత్రం అవుతున్నా వారింట్లో నుంచి అలికిడి లేకపోవడంతో ఇంటికి వెళ్లి తలపు తట్టామని పేర్కొన్నారు. చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడి దృశ్యాన్నిచూసి షాకయ్యారు. కొన ఊపిరితో ఉన్న సంజు భురియాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బురియా భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇటీవల పుట్టిన ఆమె కుమారుడిని చూసుకునేందుకు మహారాష్ట్ర నుంచి అతడి అత్తయ్య, బావమరిది వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News