Narendra Modi: ఏటా దీపావళికి ఐదు రోజులు అడవిలో ఒంటరి జీవితం గడిపేవాడిని: ప్రధాని నరేంద్రమోదీ

  • నా వ్యక్తిత్వ నిర్మాణానికి ఇది ఎంతో ఉపయుక్తమయ్యేది
  • ఇందుకోసం స్వచ్ఛమైన నీరున్న నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకునేవాడిని
  • బిజీ జీవితానికి దూరంగా గడపడం హాయగా ఉండేది

ఏటా దీపావళి సందర్భంగా ఐదు రోజుల పాటు అడవిలోని నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా గడిపేవాడినని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. యువకుడిగా ఉన్నప్పుడు తన వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ చర్య ఎంతో ఉపయుక్తమయ్యేదని అన్నారు. ఓ సామాజిక మాధ్యమానికి ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ తన జీవితంలోని పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. పదిహేడేళ్ల వయసులోనే రెండుసార్లు హిమాలయాలకు వెళ్లివచ్చినట్లు మోదీ తెలిపారు.

‘ఈ తరానిది తీరికలేని జీవితం. కానీ ఈ జీవితానికి కాస్తంత విరామం ఇచ్చి కొంత సమయం మీతో మీరు గడిపితే అది జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. అప్పుడే మీరు నిజమైన ప్రపంచంలో జీవించగలుగుతారు. మీ గురించి మీకు తెలుస్తుంది. నమ్మకం పెరుగుతుంది’ అని యువతకు ఆయన సలహా ఇచ్చారు.

‘నేను అడవిలోకి వెళ్లే ముందు స్వచ్ఛమైన నీరు లభించే ప్రాంతాన్ని ఎంచుకునే వాడిని. అక్కడ గడిపే ఐదు రోజులకు అవసరమైన ఆహారం తీసుకుని వెళ్లేవాడిని. అక్కడికి వెళ్లాక మరో ప్రపంచంలోకి వెళ్లిపోయే వాడిని’ అని తెలిపారు. దినపత్రికలు, రేడియో వంటి సదుపాయాలేవీ లేని ప్రాంతంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడం చాలా హాయినిచ్చేదని అన్నారు.

 ఇలా జీవించినప్పుడు ఇతరులు మనగురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చన్నారు. అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని, దాన్ని నిరూపించుకోవాలి తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడడం వల్ల కాలం వృథా అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదని యువతకు ఉద్బోధించారు.

More Telugu News