Telugudesam: అగ్రవర్ణాల్లో కాపుల సంఖ్యే ఎక్కువ.. వీరిని వైఎస్ రాజశేఖరరెడ్డి మోసం చేశారు!: సీఎం చంద్రబాబు

  • కులాల మధ్య చిచ్చుకు బీజేపీ, వైసీపీ కుట్ర
  • కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చాం
  • టీడీపీ నేతలు, కార్యకర్తలతో సీఎం టెలీకాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైసీపీ, బీజేపీ యత్నిస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అగ్రకులాల్లో కాపులు సగానికిపైగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అగ్రకులాల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల శాతమే అధికమని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.

అగ్రవర్ణాల రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం ఇచ్చామని ఏపీ సీఎం చెప్పారు. ఈ విషయంలో బీజేపీ, వైసీపీలు వక్రీకరణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఢిల్లీకి వెళ్లి కాపుల రిజర్వేషన్ పై అడగలేని అసమర్థులు, కాపులకు మేలు చేసిన టీడీపీని నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్ ఇస్తామని వైఎస్ మోసం చేశారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపితే బీజేపీ, వైసీపీలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో సంస్కరణల వేగం తగ్గిందన్న ఆందోళన అన్నివర్గాల్లో ఉందని ఏపీ సీఎం వ్యాఖ్యానించారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎం) బదులుగా బ్యాలెట్ పేపర్లు తీసుకురావాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఒకవేళ కుదరకుంటే వీవీప్యాట్ రసీదులను అన్ని నియోజకవర్గాల్లో 100 శాతం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దావోస్ లో లోకేశ్ టీమ్ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. డెలాయిట్, విప్రో, ఎజైల్, స్విస్ రే అనే కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు.

More Telugu News