Maharashtra: మహారాష్ట్ర సచివాలయంలో 13 వెయిటర్ ఉద్యోగాలు... గ్రాడ్యుయేట్లు సహా పోటీపడుతున్న 7 వేల మంది!

  • విద్యార్హత కేవలం 4వ తరగతి మాత్రమే
  • మహారాష్ట్రలో ఉద్యోగాల కల్పన లేదన్న ఎన్సీపీ
  • దరఖాస్తుదారులను ఆపలేమన్న ప్రభుత్వం

మహారాష్ట్ర సచివాలయంలోని క్యాంటీన్ లో 13 వెయిటర్ ఉద్యోగాలకు డిగ్రీలు చేసిన వారు సహా 7 వేల మంది పోటీ పడుతున్నారు. ఈ ఉద్యోగానికి 4వ తరగతి ఉత్తీర్ణత మాత్రమే విద్యార్హత కాగా, రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో వెయిటర్ ఉద్యోగాలకు వచ్చిన పోటీని చూస్తేనే తెలుస్తోంది. వెయిటర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడటంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చాలినన్ని ఉద్యోగాలను కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

యువకులు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన ఆయన, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం లేదన్నారు. నిర్మాణరంగంలో ఏ విధమైన ఉపాధీ లభించడం లేదని, నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాగా, ఎన్సీపీ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఏవైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే, ఎవరైనా దరఖాస్తు చేసుకుంటారని ఆర్థికమంత్రి సుధీర్ ముంగంతివార్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాలను కల్పించిందని అన్నారు. ఇక మహారాష్ట్ర గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని నిరుద్యోగుల సంఖ్య ఏడాది వ్యవధిలో 33.56 లక్షల నుంచి 42.2 లక్షలకు చేరింది. ఇదే సమయంలో కొత్త ఉద్యోగాల కల్పన 17 వేలకు పడిపోయింది.

More Telugu News