సిద్ధగంగ మఠం పీఠాధిపతి శివకుమార స్వామి చివరి కోరిక!

22-01-2019 Tue 15:51
  • చికిత్స పొందుతున్న సమయంలో చివరి కోరిక కోరిన శివకుమార స్వామి
  • ఉదయం శివైక్యం చెందితే పిల్లలంతా అల్పాహారం తీసుకున్న తర్వాత ప్రకటించండి
  • మధ్యాహ్నం లేదా రాత్రి అయితే.. భోజనాలు పూర్తైన తర్వాత ప్రకటించండి
కర్ణాటకలోని సిద్ధగంగ మఠం పీఠాధిపతి శివకుమార స్వామి 111 ఏళ్ల వయసులో శివైక్యం చెందిన సంగతి తెలిసిందే. సిద్ధగంగ పాత మఠంలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ఓ కోరిక కోరారట. అయితే, ఆయన ఎలాంటి గొప్ప కోరిక కోరలేదు. తాను ఏ క్షణంలోనైనా శివైక్యం చెందబోతున్నానని... ఉదయం పూట తుదిశ్వాస విడిస్తే పిల్లలంతా అల్పాహారం తీసుకున్న తర్వాత... మధ్యాహ్నం లేదా రాత్రి అయితే పిల్లల భోజనాల తర్వాతే తాను శివైక్యం చెందినట్టు ప్రకటించాలని ఆయన కోరారు.

సోమవారం ఉదయం 11.44 గంటల సమయంలో ఆయన శివైక్యం చెందారు. ఆ సమయంలో పిల్లలు భోజనం చేస్తున్నారు. స్వామి కోరిక మేరకు మఠం నిర్వాహకులు ఆ విషయాన్ని వెంటనే ప్రకటించలేదు. పిల్లల భోజన కార్యక్రమం పూర్తైన తర్వాత శివకుమార స్వామి శివైక్యం చెందారనే విషయాన్ని ప్రకటించారు. విషయం తెలుసుకున్న పిల్లలంతా ఒక్కసారిగా ఉద్వేగానికి గురై, ఏడుస్తూ మఠం వైపుకు పరుగులు తీస్తూ వెళ్లారు. నడిచే దేవుడిగా పేరున్న శివకుమార స్వామి చివరి కోరిక ఈ విధంగా తీరింది.