Andhra Pradesh: విజయనగరం జిల్లాలో విషాదం.. రైలు పట్టాలపై విగతజీవులుగా ప్రేమికులు

  • యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయం
  • బంధువుల ఇంటికొచ్చిన వధూవరులు
  • సోమవారం పట్టాలపై శవాలుగా తేలిన ప్రేమికులు
తమ ప్రేమ ఫలించే అవకాశం లేదని భావించిన ప్రేమికులు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామంలో జరిగిందీ ఘటన. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. బొబ్బిలిలోని జగన్నాథపురానికి చెందిన సీహెచ్ చంద్రశేఖర్ (21), కె.కృష్ణవేణి (19) ప్రేమికులు. కృష్ణవేణికి ఇటీవలే మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. బుధవారమే పెళ్లి జరగాల్సి ఉంది. ఆదివారం వధూవరులిద్దరూ బైక్‌పై పార్వతీపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.

పార్వతీపురం చేరుకున్న తర్వాత కాసేపటికే వధువు కృష్ణవేణి అదృశ్యమైంది. ఆమె కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు, బంధువులకు పెళ్లి కుమారుడు సమాచారం అందించాడు. అందరూ కలిసి గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోమవారం తెల్లవారుజామున ఓ జంట రైలు పట్టాలపై మృతి చెంది ఉండడాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి మృతులను చంద్రశేఖర్, కృష్ణవేణిగా గుర్తించారు. డిగ్రీ సెకండియర్ చదువుతున్న చంద్రశేఖర్ ఇటీవలే కానిస్టేబుల్ పరీక్ష రాశాడు. తమ ప్రేమ పెళ్లికి దారితీసే పరిస్థితులు కనిపించకపోవడంతోనే వీరు బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Vizianagaram
Bobbili
Lovers
Dead
Railway track

More Telugu News