Union Budget 2019-20: బడ్జెట్ 'హల్వా వేడుక' ప్రారంభం... ఇక ఆద్యంతం అత్యంత రహస్యం!

  • 2019-20 బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభం
  • హల్వా వేడుకలో పాల్గొన్న శివ ప్రతాప్ శుక్లా
  • ఈ పది రోజులూ ఉద్యోగులంతా నార్త్ బ్లాక్ లోనే

2019-20 వార్షిక బడ్జెట్ ప్రతుల ముద్రణ లాంఛనంగా మొదలైంది. నేడు ఆర్థిక శాఖ కార్యాలయంలో సంప్రదాయ హల్వా వేడుకను నిర్వహించారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అమెరికాలో ఉన్న నేపథ్యంలో, ఈ వేడుకలో ఆ శాఖ సహాయమంత్రి శివ ప్రతాప్‌ శుక్లా పాల్గొన్నారు. ముద్రణా పనుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ హల్వాను పంచారు.

ప్రతి సంవత్సరమూ బడ్జెట్ ప్రతుల ముద్రణా పనుల ప్రారంభానికి ముందు 'హల్వా వేడుక' జరుగుతుంది. ఈ వేడుకలో పాల్గొని హల్వాను తిన్న వారంతా, తిరిగి పార్లమెంట్ పరిధిలోని నార్త్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేది పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం మొదలైన తరువాత మాత్రమే. ఈ పది రోజులూ వారు నార్త్ బ్లాక్ అండర్ గ్రౌండ్ లో ఉండే ప్రింటింగ్ ప్రెస్ కు మాత్రమే పరిమితమవుతారు. వారి వద్ద ఎటువంటి మొబైల్ ఫోన్లూ ఉండవు. బయటి వారితో మాట్లాడేందుకూ వీలుండదు.

ఆద్యంతం అత్యంత రహస్యంగా సాగే ఈ ప్రక్రియలో పూర్తి ప్రతిపాదనల జాబితా ఆర్థికమంత్రి వద్ద కూడా వుండదు. ఇవి మొత్తం జాయింట్ సెక్రటరీ అధీనంలో ఉంటాయి. ఆయన కూడా నార్త్ బ్లాక్ బేస్ మెంట్ లో ఈ పది రోజులూ ఉండిపోయి బడ్జెట్ ప్రతుల ముద్రణా కార్యక్రమంలో పాల్గొంటారు. తుది దశ మార్పులు చేర్పుల నిమిత్తం ఆయనకు మాత్రమే బయటకు వెళ్లే వీలును కల్పిస్తారు.

వాస్తవానికి 1950 వరకూ బడ్జెట్ ముద్రణ రాష్ట్రపతి భవన్ లో జరిగేది. అక్కడి నుంచి లీకులు ఎక్కువగా ఉండటంతో, దాన్ని తొలుత మింట్‌ రోడ్‌ లోని ప్రభుత్వ ముద్రణాలయానికి మార్చారు. అక్కడా ఫలితాలు రాకపోవడం, ప్రతిపాదనలు ముందే పత్రికల్లో వచ్చేస్తుండటంతో, 1980లో నార్త్‌ బ్లాక్‌ లో ప్రెస్ ఏర్పాటు చేసి, అక్కడికి మార్చారు. అప్పటి నుంచి బడ్జెట్ ప్రతిపాదనల ముద్రణ అక్కడే జరుగుతోంది.

More Telugu News