Arun Jaitly: బడ్జెట్ కోసం అమెరికా నుంచి వెనక్కు వస్తున్న అరుణ్ జైట్లీ!

  • గత సంవత్సరం కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ
  • తాజాగా కేన్సర్ చికిత్స నిమిత్తం అమెరికాకు
  • ఆయనే బడ్జెట్ ను ప్రవేశపెడతారన్న ప్రభుత్వ వర్గాలు

గత సంవత్సరం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇటీవల కేన్సర్ బారిన పడ్డారంటూ వార్తలొచ్చాయి. ఆ చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిన ఆయన ఈ సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెట్టకపోవచ్చని, ఆయన స్థానంలో మరొకరు ఆ బాధ్యతలు తీసుకుంటారని వస్తున్న వార్తలకు తెరపడింది. బడ్జెట్‌ కోసం ఆయన అమెరికా నుంచి రానున్నారని, ఫిబ్రవరి 1వ తేదీన ఆయనే బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంట్ ముందు ఉంచుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 66 సంవత్సరాల వయసులో ఉన్న జైట్లీ, అవసరమైతే బడ్జెట్ అనంతరం తిరిగి చికిత్సను కొనసాగించుకునే నిమిత్తం మరోసారి అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

కాగా, మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మధ్యంతర బడ్జెట్ లో జైట్లీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, మధ్య తరగతి వర్గాల వారికి మేలు కలిగేలా కొన్ని నిర్ణయాలుంటాయని, వ్యవసాయ రంగానికి కొత్త స్కీమ్ లు రావచ్చని, ఆదాయపు పన్ను పరిమితిని కూడా పెంచవచ్చని సమాచారం. 2016 వరకూ కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి ఆఖరి పనిదినాన ప్రవేశపెడుతూ వచ్చిన కేంద్రం, 2017 నుంచి ఆ సంప్రదాయాన్ని మారుస్తూ, ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News