Uttar Pradesh: నోరుపారేసుకున్న బీజేపీ ఎమ్మెల్యేకు మహిళా కమిషన్‌ నోటీసులు

  • మాయావతిని ట్రాన్స్‌జెండర్‌ కంటే దారుణమన్న సాధనాసింగ్‌
  • 1995లో ఎస్పీ కార్యకర్తల దాడి ఘటనను ఉటంకిస్తూ వ్యాఖ్యలు
  • చౌకబారు వ్యాఖ్యలని ఖండించిన కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఏస్పీ అధినేత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలతో నోరుపారేసుకున్న మొఘల్‌సరాయ్‌ బీజేపీ ఎమ్మెల్యే సాధనాసింగ్‌ మాటలను జాతీయ మహిళా కమిషన్‌ తప్పుపట్టింది. ఓ పార్టీ నాయకురాలిపై ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ఎమ్మెల్యేకి నోటీసులు జారీ చేసింది.

ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో సాధనాసింగ్‌ మాట్లాడుతూ మాయావతి ఆడా కాదు, మగా కాదు అని, ట్రాన్స్‌జెండర్‌ కంటే దారుణమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 1995లో లక్నో అతిథిగృహంలో ఎస్పీ కార్యకర్తలు ఆమెపై దాడిచేసిన ఘటనను మర్చిపోయి, ఇప్పుడు అదే ఎస్పీతో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. తమ అధినేేత్రిపై సాధనాసింగ్ వ్యాఖ్యలకు బీఎస్పీ నాయకులు గట్టి కౌంటర్ ఇచ్చారు.  పార్టీ నాయకుడు సతీష్ చంద్ర మిశ్రా మాట్లాడుతూ సాధనాసింగ్ మానసిక రోగి అన్నారు. ఎస్పీ, బీఎస్పీ పొత్తును జీర్ణించుకోలేని బీజేపీ తమ నాయకురాలిపై దారుణ వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కూడా సాధనాసింగ్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ వివాదంపై దుమారం రేగడంతో సాధనాసింగ్‌ వ్యాఖ్యల వీడియోను పరిశీలించిన మహిళా కమిషన్‌ ఎమ్మెల్యేకు నోటీసులు జారీచేసింది. కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ మాట్లాడుతూ ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలను ఎలా చేయగలిగారని ప్రశ్నించారు.

More Telugu News