amit shah: అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగుకు మమత సర్కార్ అనుమతి నిరాకరణ

  • పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలో రేపు బీజేపీ ర్యాలీ
  • కోల్ కతా నుంచి మాల్దాకు హెలికాప్టర్ లో వెళ్లాల్సిన అమిత్ షా
  • హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి నిరాకరణ

పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా నిర్వహించ తలపెట్టిన రథయాత్రలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ తీరుపై బీజేపీ సుప్రీంకోర్టుకు వెళ్లినా... అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. కేవలం ర్యాలీలు మాత్రమే నిర్వహించుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

మరోవైపు స్వైన్ ఫ్లూ నుంచి అమిత్ షా ఇప్పుడే కోలుకున్నారు. పశ్చిమబెంగాలో లోని మాల్దా జిల్లాలో రేపు బీజేపీ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీ కోసం అమిత్ షా విమానంలో కోల్ కతాకు వచ్చి.... అక్కడి నుంచి హెలికాప్టర్ లో మాల్దా వెళ్లేలా రాష్ట్ర బీజేపీ నేతలు భావించారు. ఇక్కడ కూడా వారికి ఎదురుదెబ్బే తగిలింది.

పీడబ్ల్యూడీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇచ్చిన నివేదిక ప్రకారం... మాల్దా హెలిప్యాడ్ లో హెలికాప్టర్ దిగే పరిస్థితి లేదని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ తెలిపారు. హెలిప్యాడ్ వద్ద ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి ఉన్నాయని చెప్పారు. తాత్కాలిక హెలిప్యాడ్ లో హెలికాప్టర్ దిగడం కూడా సురక్షితం కాదని తెలిపారు. ఈ కారణాల వల్ల మాల్దాలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతించబోమని స్పష్టం చేశారు.

గత కొంత కాలంగా టీఎంపీ, బీజేపీల మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్ కు మమత సర్కార్ నిరాకరించింది. తాజాగా, అదనపు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులతో... కోల్ కతా నుంచి రోడ్డు మార్గం ద్వారానే అమిత్ షా మాల్దాకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీనిపై, బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

More Telugu News