Novel technology: భారత సంతతి శాస్త్రవేత్త గొప్ప ఆవిష్కరణ.. భారత్ లాంటి దేశాలకు ఎంతో ఉపయోగకరం!

  • బ్యాక్టీరియాను ఉపయోగించి నీటిలోని బ్యాక్టీరియాకు అడ్డుకట్ట
  • సరికొత్త అల్ట్రాఫిల్టరేషన్ సాంకేతికత అభివృద్ధి
  • ప్రస్తుతం ఉన్న సాంకేతికత కంటే రెండింతలు మెరుగు

భారత సంతతి శాస్త్రవేత్త శ్రీకాంత్ సింగమనేని సారథ్యంలోని అమెరికాలోని శాస్త్రవేత్తల బృందం సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. బ్యాక్టీరియాను ఉపయోగించి నీటిలో బ్యాక్టీరియా వృద్ది చెందకుండా ఉండేలా  మెంబ్రేన్ (సన్నని పొర) టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘అల్ట్రాఫిల్టరేషన్ మెంబ్రేన్స్’ కంటే ఇది రెండింతలు శక్తిమంతంగా పనిచేస్తుంది. రక్షిత మంచినీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్న భారత్ లాంటి దేశాలకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడనుంది.

అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో ఉన్న వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ప్రతీ పదిమందిలో ఒకరికంటే ఎక్కువ మంది కనీస నీటి సౌకర్యం లేక, రక్షిత మంచినీరు దొరక్క అలమటిస్తున్నారు. 2025 నాటికి సగం మంది జనాభా నీళ్ల కరవుతో అల్లాడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

శ్రీకాంత్ బృందం అభివృద్ది చేసిన అల్ట్రాఫిల్టరేషన్ మెంబ్రేన్‌లో గ్రాఫైన్ ఆక్సైడ్, బ్యాక్టీరియల్ నానోసెల్యులోజ్ ఉపయోగిస్తారు. ఇది చాలాకాలం మన్నిక కలిగి ఉండడమే కాక, పర్యావరణ సహితంగా ఉంటుందని శ్రీకాంత్ బృందం వివరించింది. శ్రీకాంత్ బృందం అభివృద్ది చేసిన మెంబ్రేన్ టెక్నాలజీ నీటిలో బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. అలాగే, నీటిలోని హానికారక మైక్రోఆర్గాజమ్స్‌ను నియంత్రిస్తుంది.

More Telugu News