Andhra Pradesh: ప్రస్తుతం దేశంలోని తోడు దొంగలంతా బీజేపీలోనే ఉన్నారు!: యనమల

  • కోల్ కతా ర్యాలీతో బీజేపీ గుండెల్లో రైళ్లు
  • రాఫెల్ రూ.43 వేల కోట్ల కుంభకోణం మోదీ ఘనతే
  • ఎస్సీ,ఎస్టీ, ముస్లింలపై మోదీపై తీవ్ర వ్యతిరేకత
పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో విపక్షాల ర్యాలీని చూసి అధికార బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీడీపీ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 22 విపక్ష పార్టీల నేతలను ఒకే వేదికపై చూసిన బీజేపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. రాఫెల్ కుంభకోణం కన్నా పెద్ద దోపిడీ ఏముందని ప్రశ్నించారు. రాఫెల్ ఒప్పందంలో రూ.43,000 కోట్ల కుంభకోణం ప్రధాని మోదీ ఘనత కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు వేల కోట్ల రూపాయిలు ఎగ్గొట్టిన వ్యక్తుల వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అవినీతి గురించి ప్రధాని మోదీ మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలోని తోడు దొంగలంతా బీజేపీలోనే ఉన్నారని దుయ్యబట్టారు. బీజేపీ పతనం అంచులో ఉంది కాబట్టే ప్రధాని మోదీలో అసహనం పెరిగిపోయిందని విమర్శించారు. ప్రధాని మోదీ పాలనకు వ్యతిరేకంగా కోల్ కతా ర్యాలీ జరిగిందని యనమల స్పష్టం చేశారు. ఎస్సీ, బీసీ, ముస్లింలలో మోదీ పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని యనమల అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి-మోదీ నియంతృత్వానికి, చంద్రబాబు నీతిమంతమైన పాలనకు- జగన్ అవినీతికి మధ్య పోటీ జరగబోతోందని యనమల స్పష్టం చేశారు.
Andhra Pradesh
Chandrababu
Jagan
Telugudesam
Yanamala
Narendra Modi
BJP

More Telugu News