Child Marriage: బాల్య వివాహం చేస్తే నాలాగే అవుతారంటూ..: యువతి ఆత్మహత్య!

  • ఉన్నత చదువులు చదవాలనుకున్న యువతి
  • 16వ ఏటనే వివాహం చేసిన తల్లిదండ్రులు
  • ఏదీ సాధించలేకపోయానంటూ ఆత్మహత్య

ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం చేస్తూ, పెళ్లి చేసుకుని భర్తతో కలిసుండాలన్నది ఆమె కోరిక. కానీ, తల్లిదండ్రులు 16 ఏళ్లకే వివాహం చేశారు. దీంతో ఇంటర్ తోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆపై ఇద్దరు బిడ్డల తల్లయింది. జీవితంలో అన్నీ కోల్పోయానన్న బాధ. భర్త నుంచి వేధింపులు. వీటిని తట్టుకోలేని ఆమె, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్ కు చెందిన గీతాంజలి (26)కి పదహారేళ్ల వయసులోనే శంకర్ (30) అనే వ్యక్తితో పెళ్లి జరిపించారు. భర్త ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటుండగా, తన పిల్లలతో కలిసి కొత్తపేటలో అద్దె ఇంట్లో ఉంటూ దిల్‌ సుఖ్‌ నగర్‌ లో పోలీస్‌ ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకుంటోంది. ఈ క్రమంలో సంక్రాంతికి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన గీతాంజలి, వారిని అక్కడే ఉంచి శుక్రవారం కొత్తపేటకు చేరుకుంది.

తాను అనుకున్నది ఏదీ సాధించలేక పోతున్నానని, తన మరణానికి కారణం ఇదేనని, మరే తల్లిదండ్రులూ తమ బిడ్డలకు చిన్న వయసులోనే వివాహాలు చేయవద్దని కోరుకుంటూ, ఫ్యాన్‌ కు చీరతో ఉరి వేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

More Telugu News