You Tube: ప్రభాస్, షర్మిలపై తప్పుడు వీడియోలు సృష్టించిన యూట్యూబ్ చానళ్లు ఇవే!

  • పలు యూ ట్యూబ్ చానళ్ల గుర్తింపు
  • ఐదుగురికి నోటీసులు
  • విచారణను మరింత ముమ్మరం చేయనున్న పోలీసులు

టాలీవుడ్ హీరో ప్రభాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిలపై అసత్య ప్రచారం చేసిన యూ ట్యూబ్ చానళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. గతవారం ఆమె ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, విచారణ జరిపి పలు యూ ట్యూబ్ చానల్ యజమానులను గుర్తించారు. ఆ వీడియోలు చూసి అసభ్య కామెంట్లు పెట్టిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.

షర్మిలపై వ్యక్తిగత దూషణలు చేసిన చానళ్లలో మూవీ టైమ్స్, వీ సపోర్ట్ టీవీ', టీపీఎఫ్ టీవీ, జింగ్ జింగ్ టీవీ, సిల్వర్ స్క్రీన్, టాలీవుడ్ నగర్ తదితర చానళ్ల యాజమాన్యాలు, ప్రతినిధులను పిలిచి విచారించిన పోలీసులు, ఐదుగురికి నోటీసులు కూడా జారీ చేశారు. షర్మిలపై వార్తలను ప్రచారం చేసిన మరికొన్ని చానళ్లను కూడా గుర్తించామని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.

కొన్ని వందల ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల ద్వారా షర్మిలపై అసభ్య పోస్టులు సోషల్ మీడియాకు వచ్చాయని, వాటన్నింటినీ పరిశీలిస్తున్నామని అన్నారు. తాము యూ ట్యూబ్, ఫేస్ బుక్ సంస్థలను కొంత సమాచారం అడిగామని, వారు ఇంకా స్పందించలేదని చెబుతున్న అధికారులు, తమకు కావాల్సిన సమాచారం అందిన తరువాత, విచారణ ముమ్మరం చేస్తామని చెబుతున్నారు.

More Telugu News