Narendra Modi: మోదీ ప్రభుత్వంలో రాత్రికి రాత్రే తుగ్లక్ ఆదేశాలొస్తున్నాయి!: శతృఘ్నసిన్హా విమర్శలు

  • నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలకు ఏం మేలు జరిగింది?
  • రాత్రికి రాత్రే జీఎస్టీ అమలు చేశారు
  • రాఫెల్ కుంభకోణం వ్యవహారాన్ని ఎందుకు దాస్తున్నారు?

మోదీ ప్రభుత్వంలో రాత్రికి రాత్రే తుగ్లక్ ఆదేశాలు వస్తున్నాయంటూ బీజేపీ రెబెల్ నేత శతృఘ్న సిన్హా విమర్శించారు. కోల్ కతా లో బీజేపీ యేతర పక్షాలు నిర్వహించిన ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలకు ఏం మేలు జరిగింది? నోట్ల రద్దుతో రైతులు, దినసరి కూలీలు, సామాన్యులపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. రాత్రికి రాత్రే జీఎస్టీ అమలు చేశారని, చిరు వ్యాపారాలు, సంస్థలపై జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపిందని విమర్శించారు. దీనిపై ఎలాంటి ఆలోచన, చర్చలు లేకుండా జీఎస్టీలో 300కు పైగా సవరణలు జరిగాయని విమర్శించారు. రాఫెల్ కుంభకోణం వ్యవహారాన్ని దాచేందుకు ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. కాపలాదారే దొంగ అని ప్రజలు అనుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేేశారు.

'రాఫెల్ విమానాల ధరలు మూడింతలు ఎందుకు పెరిగాయి? ఒక్కో విమానం రూ.1600 కోట్లకు ఎందుకు కొనుగోలు చేశారు? ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ కు విమానాల ఒప్పందం ఎందుకు ఇవ్వలేదు? సుఖోయ్ వంటి విమానాలు తయారు చేసిన ఘనత హెచ్ఏఎల్ కు ఉందని' ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 'మోదీ హయాంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎక్కడైనా కనబడిందా? చైనా నుంచి ఇబ్బడిముబ్బడిగా వస్తున్న వస్తువులను అడ్డుకున్నారా? హామీలు మాత్రం ఘనంగా ఇచ్చారు. చర్యలు మాత్రం శూన్యమ'ని ధ్వజమెత్తారు. విపక్షాలంతా ఏకమవ్వాల్సిన సమయమొచ్చిందని ఈ సందర్భంగా శతృఘ్న సిన్హా పిలుపు నిచ్చారు.

More Telugu News