Andhra Pradesh: ‘జగన్ పై దాడి’ కేసు: ఎన్ఐఏ విచారణ విధానంపై పిటిషన్ దాఖలు చేయనున్న శ్రీనివాసరావు లాయర్లు!

  • మేం లేనప్పుడు శ్రీనివాసరావును విచారిస్తున్నారు
  • ఇది ఎన్ఐఏ కోర్టు ఆదేశాలకు విరుద్ధం
  • విచారణ సమయంపై క్లారిటీ ఇవ్వలేదని వ్యాఖ్య

జగన్ పై దాడి కేసులో ఆధారాలు, సాక్ష్యాల విషయంలో ఏపీ సిట్ అధికారులు తమకు సాయం చేయడం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్ఐఏ అధికారులకు మరో తలనొప్పి ఎదురుకానుంది. నిందితుడు శ్రీనివాసరావును వారం రోజుల కస్టడీలో భాగంగా ఎంతసేపు విచారించారో తెలుసుకునేందుకు విజయవాడ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని అతని తరఫు లాయర్లు తెలిపారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్ఐఏ అధికారులు వ్యవహరించారని ఆరోపించారు.

సొంత లాయర్ల సమక్షంలో శ్రీనివాసరావును విచారించాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయితే శ్రీనివాసరావును ఎంతసేపు విచారించారో ప్రశ్నిస్తే ఎన్ఐఏ అధికారులు జవాబు చెప్పలేదన్నారు. అంతేకాకుండా ‘ఫలానా సమయం అని ఏమీ లేదు. కేసులో తాజా సాక్ష్యాలు దొరికితే ఏ సమయంలో అయినా అతనిని విచారిస్తాం’ అని ఎన్ఐఏ అధికారులు జవాబు ఇచ్చారని ఆరోపించారు.

తమ సమక్షంలో మాత్రం శ్రీనివాసరావును గౌరవంగా చూశారని అన్నారు. తాము లేనప్పుడు విచారణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్ఐఏ అధికారులు తాము లేనప్పుడు విచారణ చేపట్టడంపై ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. నేటితో శ్రీనివాసరావు కస్టడీ ముగియడంతో అతడిని ఈరోజు విజయవాడ కోర్టు ముందు ఎన్ఐఏ హాజరుపర్చనుంది. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో శ్రీనివాసరావు దాడిచేసిన సంగతి తెలిసిందే.

More Telugu News