USA: భారత సంతతి వ్యక్తి రాజా కృష్ణమూర్తికి యూఎస్ లో కీలక పదవి

  • ఇంటెలిజెన్స్ విభాగంపై కాంగ్రెషనల్ కమిటీ ఏర్పాటు
  • కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తి
  • తనవంతు కృషి చేస్తానన్న కృష్ణమూర్తి

అమెరికాలో భారత సంతతికి చెందిన డెమోక్రాటిక్ పార్టీ ప్రజాప్రతినిధి రాజా కృష్ణమూర్తి. ఇంటెలిజెన్స్ విభాగంపై ఏర్పాటు చేసిన కాంగ్రెషనల్ కమిటీలో ఆయన్ని నియమించారు. ఇల్లినాయిస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజా కృష్ణమూర్తిని ఈ కమిటీలో నియమించడంతో కీలక పదవి లభించినట్టయింది. ఈ విభాగంలో పని చేయనున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు.

కాగా, ఈ కమిటీలో రాజా కృష్ణమూర్తి సహా నలుగురు సభ్యులు ఉన్నారు. ఫ్లోరిడాకు చెందిన వాల్ డెమింగ్స్, న్యూయార్క్ కు చెందిన సేన్ పాట్రిక్ మలోని, వెర్మాంట్ కు చెందిన పీటర్ వెల్చ్ ఈ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. అమెరికాలో 17 ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పనితీరును, బడ్జెట్ ను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

ఈ పదవి పొందడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా: రాజా కృష్ణమూర్తి 


ఈ సందర్భంగా రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ, కమిటీలో తోటి వారితో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని, తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇవ్వడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఉగ్రవాదం నుంచి సైబర్ నేరాల వరకు అమెరికా దేశ భద్రతకు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వీటిని ఎదుర్కొనేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.  

ఇదిలా ఉండగా, తమిళ కుటుంబానికి చెందిన రాజా కృష్ణమూర్తి ఢిల్లీలో జన్మించారు. ఆ తర్వాత వీరి కుటుంబం న్యూయార్క్ కు వలస వెళ్లింది. ప్రిన్స్ టన్ యూనివర్శిటీలో ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. హార్వర్డ్ లా స్కూల్ లో కూడా చదువుకున్నారు.

More Telugu News