Chandrababu: చివరకు కేసీఆర్ కు మిగిలేది జగన్ మాత్రమే: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • నిన్నటి భేటీతో ముసుగు తొలగిపోయింది
  • బీజేపీ వ్యతిరేక శక్తులను చీల్చేందుకు కుట్ర
  • నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో ఒక్క వైఎస్ జగన్ తప్ప మరెవరూ భాగం కాబోరని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నుంచి ఎంతమాత్రమూ స్పందన లేదని అన్నారు. కేటీఆర్, జగన్ లు హడావుడిగా భేటీ అయ్యారని అభిప్రాయపడ్డ చంద్రబాబు, ఈ భేటీతో రెండు పార్టీల మధ్యా ఉన్న ముసుగు తొలగిపోయిందని చెప్పారు.

బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చాలన్నదే కేసీఆర్ కుట్రని, అందుకు సహకరించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుతంత్రాలు పన్నుతున్నారని, తిరిగి కేంద్రంలో బీజేపీ రావాలన్నదే వారిద్దరి ఆశయమని విమర్శలు గుప్పించారు. బీజేపీ అజెండాను అమలు చేసేందుకే ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. దేశంలో పార్టీలను గందరగోళ పరిచి, ప్రజల్లో అయోమయం పెంచడమే వీరి లక్ష్యమని దుయ్యబట్టారు.

ఏపీకి హోదా ఇస్తే, తెలంగాణకు కూడా ఇవ్వాలని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన చంద్రబాబు, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని సంస్థల విభజనకు అడ్డం పడ్డారని మండిపడ్డారు. ఆఖరుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కేసీఆర్ అమలు చేయనివ్వలేదని వ్యాఖ్యానించారు.

విభజన చట్టంలోని అంశాలు అమలు చేస్తారా? సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని చెబుతారా? పోలవరం ప్రాజెక్టుకు అడ్డం పడకుండా ఉంటారా? ఏపీకి ప్రత్యేక హోదాకు అడ్డురాకుండా ఉంటారా? ఈ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కనీసం జగన్ అయినా, కేసీఆర్ ను ఈ ప్రశ్నలు అడిగి సమాధానాలను తెలుసుకుని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

టీడీపీపై షర్మిల ఫిర్యాదు చేయడం దురదృష్టకరమని, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసింది వైకాపాయేనని చంద్రబాబు నిప్పులు చెరిగారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణను లక్ష్యంగా చేసుకుని వైసీపీ దుష్ప్రచారం సాగించిందని, అసభ్య ప్రచారం చేసిందని వ్యాఖ్యానించారు.

More Telugu News